![]() |
నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పేర్లు
» దేవుని ఆత్మ. (ఆది. 1:2; యోబు. 33:4).
» యెహోవా ఆత్మ. (యెషయా. 11:2; 40:3; 61:1).
» పరిశుద్ధాత్మ. (కీర్తన. 51:11; యెషయా. 63:10).
» నా ఆత్మ. (యోవేలు 2:28-29).
సృష్టికి ముందు పరిశుద్ధాత్మ
● నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కవగా శుద్ధిచేయును. – (హెబ్రీ. 9:14).
● నిత్యుడు అనగా నిరంతరము ఉన్నవాడు. కావున జగత్తు పునాది వేయబడకమునుపే ఉన్నవాడని మరియు అదృశ్యమైనవి నిత్యములు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. – (2 కొరింధి. 4:18).
సృష్టి ప్రారంభములో పరిశుద్ధాత్మ
● ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. – (ఆది. 1:1-2).
● దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. (యోబు. 33:4).
అందరి ప్రయోజనముకొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (1 కొరింధి. 12:7;11).
సృష్టి నిర్మాణములో పరిశుద్ధాత్మ
● నిత్యత్వములో దేవుని యొక్క ఆలోచనలకు ఆకారమిచ్చిన యేసుక్రీస్తు వారియొక్క పనికి కొలమానమిచ్చినది మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు. (ఆది. 1:1; 1 కొరింధి. 8:6; కొలస్సి. 1:15-17).
● తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? (యెషయా. 40:12).
పాత నిబంధన గ్రంథము వ్రాయుంచుటలో పరిశుద్దాత్ముని పని
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. (2 పేతురు. 1:20:21).
» పాత నిబంధన గ్రంధములో గల ముప్పది తొమ్మిది పుస్తకములను ముప్పది మంది గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయడము జరిగినది.
» దేవుడు చేసిన సృష్టి క్రమమును, మానవ నిర్మాణమును మరియు ఏ మనుష్యునికి తెలియని గొప్ప మర్మములను అనగా 2,500 సంవత్సరముల క్రితము జరిగిన విశేష సంగతులను ప్రవక్తయైన మోషే (ద్వితియో. 18:16) ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచారు (ఆది. 1:1-31; 2:7-8, 21-23).
» దేవుని సంకల్పమును బట్టి సృష్టిలో జరిగిన మొట్ట మొదటి వివాహ బంధము గూర్చి (ఆది. 2:24-25), నోవాహు కాలములో ప్రపంచమును నాశనము చేసిన జలప్రళయము గూర్చి (ఆది. 7:17-24), అప్పటి వరకు ఒక్క జనముగా మరియు ఒక్కటే భాష మాట్లాడుతున్నవారిని భూమియందంతట వారిని చెదరగొట్టి వారి భాషను తారుమారు చేసి శాస్త్రవేత్తలకు సైతము అంతుచిక్కని మరెన్నో విశేష సంగతులను పరిశుద్ధాత్ముడు ప్రవక్తయైన మోషే ద్వారా గ్రంథములో వ్రాయించి మనకు తెలియజేసెను.
» ఆది నుండి జరిగిన అన్ని సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా ప్రతి విషయమును లేఖనముల ద్వారా మనకు తేటగా తెలియపరుచుటకు గ్రంధములో పొందుపరచెను.
» దేవుని యొక్క అనాది సంకల్పమును తన ప్రవక్తలకు పరిశుద్ధాత్ముడు తెలియజేసారు. - (2 సమూ. 23:2).
సాక్ష్యపు గుడారం నిర్మాణములో పరిశుద్ధాత్ముని పని
● విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని “దేవుని ఆత్మ” పూర్ణునిగా చేసి యున్నాను. - (నిర్గమా. 31:3-5).
● మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి; యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్ర మైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు “దేవుని ఆత్మ"తో వాని నింపియున్నాడు. - (నిర్గమా. 35:30-33).
న్యాయాధిపతుల కాలములో పరిశుద్దాత్ముని పని
● "యెహోవా ఆత్మ” గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి. - (న్యాయా. 6:34).
● “యెహోవా ఆత్మ” యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. - (న్యాయా. 11:2,29).
● “యెహోవా ఆత్మ” జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. - (న్యాయా. 13:25).
● “యెహోవా ఆత్మ” అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు. - (న్యాయా. 14:9,19).
రాజుల కాలములో పరిశుద్దాత్ముని పని
● సౌలు ఆ వర్తమానము వినగానే “దేవుని ఆత్మ” అతనిమీదికి బలముగా వచ్చెను. - (1 సమూ. 11:6).
● సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి “యెహోవా ఆత్మ” దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను. - (1 సమూ. 16:13).
● ఆ కాలమున “దేవుని ఆత్మ” ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను. - (2 దినవృత్తా. 15:1).
● “యెహోవా ఆత్మ” అతని (యహజీయేలు) మీదికి రాగా అతడీలాగు ప్రకటించెను. - (2 దినవృత్తా. 20:14).
● అప్పుడు “దేవుని ఆత్మ” యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. - (2 దినవృత్తా. 24:20).
పాత నిబంధనలో తండ్రి యొక్క వాగ్ధానము
ప్రవచనము :
» తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. - (యోవేలు 2:28-29)
నెరవేర్పు :
» పరిశుద్ధాత్ముని గూర్చిన తండ్రి యొక్క వాగ్ధానమును అపోస్తులులకి మాత్రమే ఇవ్వబడుట గూర్చి ముందుగానే క్రీస్తు వారు తన శిష్యులకి తెలియపరచుట. – (లూకా. 24:49).
» అందరు పరిశద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ఛక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. యోవేలు ప్రవక్తద్వారా చెప్పబడిన సంగతి యిదే. (అపో.కార్యా. 2:4,16).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన
3 comments
commentsSuper Post Brother
ReplyWell done bro....
Replyవందనములు సిస్టర్
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com