Showing posts with label జారత్వం నుండి పారిపో. Show all posts
Showing posts with label జారత్వం నుండి పారిపో. Show all posts

“జారత్వం నుండి పారిపో” 🚶🏼



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏻 


జారత్వం గురించి మాట్లాడటం కేవలం లైంగిక సంబంధాల గురించి మాట్లాడటం కాదు. ఇది మనిషి దేహం, మనస్సు, హృదయం, వివాహం, కుటుంబం, సంఘం, పరిశుద్ధత మరియు దేవునితో సంబంధం గురించి మాట్లాడే ముఖ్యమైన బైబిల్ విషయం. మనిషి జీవితంలో కొన్ని పాపాలు బయటకు కనిపించే చర్యలుగా ప్రారంభమవుతాయి. మరికొన్ని మాత్రం ముందుగా మనస్సులో పుడతాయి, క్రమంగా కోరికగా పెరుగుతాయి, తరువాత మాటల్లోకి, ప్రవర్తనలోకి, చివరకు జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల్లోకి వస్తాయి. జారత్వం కూడా చాలాసార్లు ఇలాగే అభివృద్ధి చెందుతుంది. ఒక చూపు, ఒక ఆలోచన, ఒక సంభాషణ, ఒక రహస్య పరిచయం, ఒక చిన్న రాజీ ఇవి ఒక్కొక్కటి విడిగా చూసినప్పుడు చిన్న విషయాల్లా కనిపించవచ్చు. కానీ అవే మనిషిని పాపం వైపు నడిపించే అడుగులుగా మారవచ్చు. అందుకే బైబిల్ జారత్వం విషయంలో కేవలం “జాగ్రత్తగా ఉండండి” అని లేదా “ఎదిరించండి” అని చెప్పకుండా, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని ఆజ్ఞాపిస్తుంది (1 కొరింథీయులకు 6:18 చూడుము).


నేటి సమాజంలో లైంగిక నైతికత గురించి మాట్లాడేటప్పుడు “వ్యక్తిగత స్వేచ్ఛ”, “నా శరీరం నా ఇష్టం”, “ఇది సాధారణమైన విషయం”, “అందరూ చేస్తున్నారు”, “ఇది ఎవరికీ హాని చేయదు” వంటి మాటలు తరచుగా వినిపిస్తాయి. అందుకే గత 2025 నవంబర్ నెలలో అశ్లీలత అనే అంశము రాయటం జరిగింది మీలో ఇంకా ఎవరైనా చదివి ఉండకపోతే క్లిక్ చేసి పూర్తిగా చదవండి. చివరిగా... సమాజం ఒక విషయాన్ని సాధారణం చేయడం వల్ల అది దేవుని దృష్టిలో పవిత్రమైనది అయిపోదని వీక్షకులు గుర్తించవలసిందిగా మా మనవి 🙏🏻


"మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.౹" (1థెస్సలొనీకయులకు 4:3) ఇక్కడ దేవుని యొక్క చిత్తమేంటో స్పష్టముగా కనిపిస్తుంది. అందుకే 1 కొరింథీయులకు 6:18లో పౌలు గారు “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని చెప్పాడు కానీ “జయించండి” అని చెప్పలేదు. ఎందుకంటే కొన్ని ప్రలోభాలను దగ్గరగా నిలబడి జయించడం కంటే, వాటి నుండి దూరంగా ఉండటమే ఆత్మీయ జ్ఞానం.


కాబట్టి ఈ రోజు మనం కేవలం “జారత్వం అంటే ఏమిటి?” అనే ప్రశ్నను మాత్రమే కాదు, జారత్వం ఎక్కడ మొదలవుతుంది? మనిషి దాని వైపు ఎందుకు వెళ్తాడు? దేహం గురించి బైబిల్ ఏమి చెబుతోంది? దేవుడు వివాహాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? జారత్వం నుండి ఎలా తప్పించుకోవాలి? అనే ప్రశ్నలను పరిశీలిద్దాం.

1️⃣. జారత్వం అంటే ఏమిటి?

నూతన నిబంధనలో “జారత్వము” అనే పదానికి ప్రధానంగా ఉపయోగించబడిన గ్రీకు పదం 

πορνεία — porneía — G4202

Greek: πορνεία

Transliteration: porneia

Pronunciation: పోర్-నెయా / పోర్నెయా

Part of Speech: Noun, feminine

Strong’s: G4202 

ఇది దేవుడు ఏర్పాటు చేసిన లైంగిక నైతిక హద్దులకు విరుద్ధమైన లైంగిక అనైతికతను సూచించే విస్తృత పదం. దీనిని కేవలం “పెళ్లికి ముందు లైంగిక సంబంధం” అనే ఒకే అర్థానికి పరిమితం చేయడం సరైంది కాదు. సందర్భాన్ని బట్టి వివిధ రకాల లైంగిక అనైతిక ప్రవర్తనలను సూచించగల పదం ఇది. 


√ “జారత్వం” — లైంగిక అనైతికత అనే పాపకార్యం. (fornication, sexual immorality)

√ “జారుడు” — πόρνος (pornos, G4205): ఆ పాపంలో జీవించే వ్యక్తి అని అర్థం.

√ “జారులు” — pornoi : పాపంలో జీవించే అనేక వ్యక్తులు అని అర్థం.


జారత్వం(porneiai) వేరు - వ్యభిచారం(moicheiai) వేరు... ఈ రెండు ఒకటి కాదు. ప్రభువు చిత్తమైతే వ్యభిచారం కోసం కూడా ఆలోచన చేద్దాం. 


2️⃣. జారత్వం ఎక్కడ పుట్టును?

జారత్వాన్ని చాలామంది కేవలం శారీరక చర్యగా మాత్రమే చూస్తారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే జారత్వం మొదలైందని అనుకోవచ్చు. అయితే యేసు బోధను పరిశీలిస్తే, పాపం బయటకు కనిపించే చర్యకంటే ముందే మనిషి అంతరంగంలో ఒక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. శరీరం చేసే పనికి ముందు మనస్సులో ఆలోచన, హృదయంలో కోరిక, ఆ కోరికకు మనిషి ఇచ్చే సమ్మతి ఉంటాయి. అందుకే జారత్వాన్ని కేవలం శరీరాన్ని నియంత్రించడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోలేం; హృదయాన్ని కూడా కాపాడుకోవాలి.

యేసు మత్తయి 15:18–19లో మనిషి నోటి నుండి వచ్చేవి లోపల, హృదయం నుండి వస్తాయని చెప్పి, ఆ తరువాత “జారత్వములు, వ్యభిచారములు…” వంటి పాపాలను ప్రస్తావించాడు. అలాగే మార్కు 7:21–23లో “లోపల నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, జారత్వములు… వచ్చును.”  అని బోధించాడు. 

పాపం మొదట శరీరంలో కనిపించదు సుమీ! ముందుగా నీ హృదయ అంతరంగంలో రూపుదిద్దుకుంటుంది. ఒక వ్యక్తి అక్రమ సంబంధంలోకి వెళ్లే ముందు అతని మనస్సులో ఆ వ్యక్తి గురించి తప్పు కోరిక పెరగవచ్చు. ఆ కోరికను అతడు అడ్డుకోకుండా పెంచుకోవచ్చు. తరువాత దానికి అనుకూలమైన పరిస్థితులను వెతుక్కోవచ్చు. ఆ తరువాత రహస్య సంభాషణలు, సన్నిహిత సంబంధాలు, అవకాశాల కోసం ప్రయత్నించడం జరుగవచ్చు. చివరకు శారీరక చర్య బయటకు రావచ్చు. కాబట్టి శారీరక పాపం బయట కనిపించే చివరి దశ కావచ్చు. దాని విత్తనం మాత్రం చాలా ముందే హృదయంలో పడుతుంది.

ఇందుకే యేసు మత్తయి 5:27–28లో వ్యభిచారం గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం శారీరక చర్యను మాత్రమే చూడలేదు. ఒక స్త్రీని కామపూరిత ఉద్దేశంతో చూడడం గురించి హెచ్చరించాడు. దీని అర్థం ప్రతి స్త్రీని చూడటం పాపం అని కాదు. సాధారణంగా చూడటం మరియు ఉద్దేశపూర్వకంగా కామపూరిత కోరికతో చూడటం రెండూ ఒకటి కావు. యేసు హెచ్చరిస్తున్నది హృదయంలో కోరికను పెంచుకొని దానికి సమ్మతించడం గురించి మాత్రమే అని గుర్తించుము. 

అందుకే జారత్వం విషయంలో అసలు కాపలా శరీరానికి బయట కాదు—హృదయంలో మొదలవ్వాలి. మనిషి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: నేను ఏమి చూస్తున్నాను? దాన్ని ఎలా చూస్తున్నాను? నా మనస్సులో ఏ ఆలోచనలను పెంచుతున్నాను? నేను ఎవరితో ఎలాంటి సంభాషణలు చేస్తున్నాను? ఎవరూ చూడని సమయంలో నా ఊహలు ఎలా ఉన్నాయి? ఇవి చిన్న ప్రశ్నలు కావు. ఎందుకంటే హృదయంలో పెంచినదే ఒకరోజు ప్రవర్తనలో బయటపడే అవకాశం ఉంది.


"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును." (సామెతలు. 4:23-26) యోబు కూడా తన చూపుల విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని.” (యోబు 31:1) ఇది చాలా గొప్ప ఆచరణాత్మకమైన సంగతి. ప్రతీ విశ్వాసి ఆలోచన చేయాలి. పాపం వచ్చిన తరువాత దాన్ని ఆపడానికి ప్రయత్నించడం కంటే, పాపానికి దారి తీసే ఆలోచనను మొదట్లోనే ఆపడం సురక్షితమైన మార్గం. 


3️⃣. జారత్వం ఎలా మొదలవుతుంది?

సామెతలు 7వ అధ్యాయం లో దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ కలదు అదేమనగా…


👤 యువకుడు :

జ్ఞానం లేకుండా ఉన్నాడు — 7:7

జారస్త్రీ ఇంటి మార్గంలోకి వెళ్లాడు — 7:8

చీకటి సమయంలో అక్కడ ఉన్నాడు — 7:9

ఆమెను కలిశాడు — 7:10

ఆమె మాటలు విన్నాడు — 7:14–20

ఆమె మాటలకు లోబడ్డాడు — 7:21–22

చివరకు నాశన మార్గంలో అనగా పాతాళమునకు మరణ గదులకు వెళ్లాడు — 7:22–27


పాపం బయట కనిపించే రోజున మాత్రమే ప్రారంభం కాదు దానికి ముందే మనిషి హృదయంలో దానికి స్థలం ఇచ్చినప్పుడు ప్రారంభమవుతుంది అనేది మా విశ్వాసం.

అందువల్ల నిజ క్రైస్తవుడు కేవలం తన శరీరాన్ని మాత్రమే కాపాడుకోవడం సరిపోదు. కళ్ళను కాపాడాలి, ఆలోచనలను కాపాడాలి, హృదయాన్ని కాపాడాలి, సంబంధాలకు హద్దులు పెట్టాలి. ఎందుకంటే హృదయంలో పెంచుకున్న కోరికకు నీవు నిరంతరం ఆహారం ఇస్తే, ఒకరోజు అది ఒక భయంకరమైన చర్యగా బయటపడే ప్రమాదం ఉంది జాగ్రత్తగా సుమీ!!

4️⃣. జారత్వం బుద్ధిహీనతకు దారి

బుద్ధిహీనత అనగా జ్ఞానం లేకపోవడం మాత్రమే కాదు. అతనికి ఉన్న కాస్త జ్ఞానాన్ని, సత్యాన్ని, వివేచనను సరిగ్గా ఉపయోగించకపోవడమే దాని అర్థం. 

"జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు."(సామెతలు. 6:32-33) ఒక క్షణికమైన కోరిక కోసం తీసుకున్న నిర్ణయం తరువాత ఎంతటి మూల్యం చెల్లించాల్సి రావచ్చో హెచ్చరిస్తోంది.


ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి 

✓ బుద్ధిహీనత

✓ నాశనం

✓ అవమానం

ఒక క్షణిక కోరిక కోసం మనిషి సంవత్సరాల నమ్మకాన్ని, కుటుంబ సంబంధాలను, మంచి పేరును, మనస్సాక్షిని, ప్రశాంతతను, ఆత్మీయ స్థితిని ప్రమాదంలోకి నెట్టవచ్చు.


🗣️ ఉదాహరణ 1 : దావీదు జీవితాన్ని పరిశీలిస్తే ఈ సూత్రం స్పష్టమవుతుంది. 2 సమూయేలు 11లో దావీదు బత్షెబాను చూశాడు. ఆ చూపు అక్కడితో ముగియలేదు. అతడు ఆమె గురించి విచారించాడు, ఆమెను పిలిపించాడు, పాపం చేశాడు. తరువాత ఆ పాపాన్ని దాచడానికి ప్రయత్నించాడు. చివరకు ఊరియా మరణానికి దారి తీసే కుట్రకు పాల్పడ్డాడు. ఒక తప్పు నిర్ణయం మరొక నిర్ణయాన్ని అవసరం చేసింది. చివరికి నాతాను ప్రవక్త అతనిని ఎదిరించాడు. దావీదు “నేను యెహోవాకు విరోధముగా పాపము చేసితిని” అని ఒప్పుకున్నాడు (2 సమూయేలు 12:13)


🗣️ ఉదాహరణ 2 : ఆదికాండము 39లో యోసేపు జీవితంలో ఒక సంఘటన చూడగలం. పోతీఫరు భార్య అతనిని పదేపదే ప్రలోభపెట్టింది. యోసేపు గారి ఆ పరిస్థితిని తేలికగా తీసుకోలేదు. “ఎవరూ చూడరు”, “ఒక్కసారి మాత్రమే”, “ఒక అధికారిని కదా”, “దేశం కానీ దేశం”, “ఏమి కాదు”, “నేను నియంత్రించగలను” అని తనను తాను సమర్థించుకోలేదు. అట్టి భయంకరమైన పరిస్థితిలో తనముందు జారత్వం తాండవం చేసిన అతడు దేవుని గురించి ఆలోచించాడు. 


"....నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.౹" (ఆదికాండము 39:9) ఇదే అబ్రాహాము గారి సంతాన స్వభావంమంటే 👏🏻👏🏻


చివరకు ఆమె అతని వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు, యోసేపు అక్కడ నిలబడి తన ఆత్మీయ బలాన్ని పరీక్షించుకోలేదు. ఆదికాండము 39:12 ప్రకారం అతడు తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. ఇదేనండి 1 కొరింథీయులకు 6:18లో పౌలు చెప్పిన సూత్రానికి జీవించిన గొప్ప ఉదాహరణ  “జారత్వమునకు దూరముగా పారిపోవుడి.”


🔎ఒకడు(దావీదు) దాని వైపు వెళ్లాడు. మరొకడు(మోసేపు) దాని నుండి పారిపోయాడు. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. కొన్నిసార్లు పాపాన్ని జయించడానికి గొప్ప గొప్ప మాటలు అవసరం లేదు. ఒక నిర్ణయం చాలు అదే అక్కడి నుండి వెళ్లిపోవడం లేదా సంభాషణను ముగించడం లేదా ఆ సంబంధానికి హద్దు పెట్టడం లేదా ఆ దృశ్యాన్ని మూసివేయడం లేదా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టడం లేదా ఆ ఫోన్ సంభాషణను ఆపడం లేదా ఆ రహస్య పరిచయాన్ని పూర్తిగా ముగించడం. పాపానికి దగ్గరగా ఉండి పరిశుద్ధంగా ఉండటమే గొప్ప ఆత్మీయత కాదు. పాపానికి అవకాశం ఇవ్వకుండా దూరంగా ఉండటమే జ్ఞానం.


5️⃣. “నా దేహం — నా ఇష్టం”

నీవు లోకం క్రింద ఉంటే అదే అపవాది చెరలో ఉంటే సమస్యే లేదు కానీ క్రీస్తు నందు ఉంటూ “నా దేహం — నా ఇష్టం” అంటేనే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావని గుర్తించుము. 1 కొరింథీయులకు 6:19–20లో పౌలు గారు క్రైస్తవుని యొక్క దేహం గురించి పూర్తిగా భిన్నమైన దృక్కోణాన్ని చూపాడు అదేమనగా. “మీరు మీ సొత్తు కారు; విలువపెట్టి కొనబడినవారు...” అని చెబుతాడు అంటే క్రైస్తవుని దేహం స్వేచ్ఛగా ఏదైనా చేయడానికి తన వ్యక్తిగత ఆస్తి అనే భావనతో చూడబడదు. నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం. క్రీస్తు దేహానికి సంబంధించిన వ్యక్తి తన దేహాన్ని కూడా క్రీస్తుకు సంబంధించినదిగా చూడాలి. అందుకే 1 కొరింథీయులకు 6:20లో “మీ దేహముతో దేవుని మహిమపరచుడి” అని చెప్పబడింది. “నేను నా దేహంతో ఏమి చేస్తున్నాను?” అనే ప్రశ్న కంటే,

“నా దేహంతో నేను ఎవరిని మహిమపరుస్తున్నాను?” అనే ప్రశ్న క్రైస్తవునికి చాలా ముఖ్యమైన ప్రశ్న. 


వ్యక్తిగతంగా అయితే….

"....దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.౹ దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.౹ మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.౹ వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? –వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?౹ అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.౹ జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.౹ మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి." 1 కొరింథీయులకు 6:13-20


భార్యాభర్తలు అయితే....

"భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు.౹" (1కొరింథీయులకు. 7:4)


దేవుడు దేహాన్ని చెడ్డదిగా సృష్టించలేదు. లైంగికతను కూడా దేవుడు సృష్టించాడు. కానీ దేవుడు దానికి హద్దు, ఉద్దేశం, గౌరవం ఇచ్చాడు. ఆదికాండము 2:24లో పురుషుడు తన భార్యతో ఏకశరీరంగా ఉండే వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హెబ్రీయులకు 13:4లో వివాహం ఘనమైనదిగాను, వివాహ పానుపు నిష్కల్మషమైనదిగాను చెప్పబడింది.

6️⃣. వివాహం దేవుని ఏర్పాటు—జారత్వానికి అనుమతి కాదు

వివాహం దేవుని ఏర్పాటు చేసిన పవిత్ర బంధం. వివాహం విషయమై పలు అంశాలు ముందుగా వ్రాయడం జరిగింది. వీలైతే వాటిని చదవండి. ఇక విషయానికి వస్తే జారత్వాన్ని నివారించడానికి బైబిల్ చెప్పే ముఖ్యమైన పవిత్రమైన వ్యవస్థ వివాహం. “జారత్వములు జరుగుచున్నందున ప్రతి పురుషునికి సొంత భార్యయు, ప్రతి స్త్రీకి సొంత భర్తయు ఉండవలెను.” (1 కొరింథీయులకు 7:2) “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏకశరీరముగా నుందురు.” (ఆదికాండము 2:24) వివాహం చేసుకున్నవాడు తన జీవిత భాగస్వామికి విశ్వసనీయంగా ఉండాలి. వివాహం కానివాడు కూడా తన శరీరాన్ని పరిశుద్ధతలో కాపాడుకోవాలి. కాబట్టి వివాహం జారత్వానికి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు దేవుని ఏర్పాటు చేసిన పవిత్రమైన నిబంధన. "వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.౹" (హెబ్రీయులకు 13:4)“జారులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” అని చెప్పడం ద్వారా వివాహానికి వెలుపల జరిగే లైంగిక పాపాన్ని దేవుడు తేలికగా చూడడని స్పష్టమవుతుంది.

వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన హద్దులలో అది గౌరవనీయమైనది. దేవుడు నిర్ణయించిన హద్దులను దాటి వెళ్తే అది పాపమవుతుంది. “వివాహం చేసుకోకపోతే తప్పనిసరిగా జారత్వంలో పడతాడు” అనేది బైబిల్ బోధ కాదు. పౌలు గారు చెప్పేది:

“కామతప్తులగుటకంటె పెండ్లి చేసికొనుట మేలు.”(1 కొరింథీయులకు 7:9) అంటే వివాహం దేవుని పవిత్రమైన ఏర్పాటు అది  జారత్వానికి అనుమతి పత్రం కాదు. 


7️⃣. జారత్వం దేవుని చిత్తానికి విరుద్ధం

"—నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.౹" (1పేతురు. 1:14) "మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.౹ మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.౹ ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు.౹ పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.౹" (1థెస్సలొనీకయులకు 4:3-7) 

పరిశుద్ధత దేవుని చిత్తం ✅

జారత్వం ఆ చిత్తానికి విరుద్ధం ✅

అందువల్ల  “ఇది నా వ్యక్తిగత విషయం” అని చెప్పి దేవుని నైతిక ప్రమాణాన్ని మార్చలేం.


🗣️ ఉదాహరణకు: సంఘము అనగా "కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని,...” (1 కొరింథీయులకు1:2)  అటువంటి కొరింథులోనున్న సంఘంలోనే తీవ్రమైన జారత్వం ఉన్నట్లు పౌలు పేర్కొన్నాడు. "మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.౹ ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారు కారు.౹"(1కొరింథీయులకు 5:1-2) అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదని అతడు చెప్పాడు. అట్టి జారులతో సాంగత్యం చేయకూడదని బోధించాడు.

“జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసితిని.”(1 కొరింథీయులకు 5:9–11) అలాగే సహోదరుడని పిలువబడే వాడే జారుడు అయితే అతనితో సన్నిహిత సహవాసం చేయకూడదని హెచ్చరించాడు.

ఇది పాపాన్ని ద్వేషించడం పాపి మారుమనసు పొందాలని కోరుకోవడం. సంఘంలో సభ్యత్వం ఉన్నంత మాత్రాన వ్యక్తిగత పరిశుద్ధత అవసరం లేకుండా పోదు సుమీ!


ఇది నేటి సంఘానికి కూడా ఒక హెచ్చరిక. సంఘానికి వస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? ప్రార్థిస్తున్నామా? సేవ చేస్తున్నామా? ఇవన్నీ ముఖ్యమే. కానీ మన రహస్య జీవితం ఎలా ఉంది? అనే ప్రశ్నను కూడా మనం దేవుని వాక్యంతో పరిశీలించాలి. ఎవరూ చూడని చోట మన ప్రవర్తన ఎలా ఉందో, దేవుని ముందు మన అసలు జీవితం అక్కడే బయటపడుతుంది కాబట్టి జాగ్రత్త మిత్రమా. 


గలతీయులలోనున్న క్రీస్తు సంఘానికి “జారత్వం, అపవిత్రత, కాముకత్వం... ” వంటి శరీర కార్యాలను పేర్కొన్న తరువాత పౌలు ఇలాంటి కార్యాలను చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని హెచ్చరిక చేసిన ఈయనే(గలతీయులకు 5:19–21) కొరింథీయులోనున్న క్రీస్తు సంఘానికి కూడా హెచ్చరిక చేసినట్టుగా ఇలా చూడగలం "అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర రని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను౹ దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.౹" (1కొరింథీయులకు 6:9-10) పాపంలో కొనసాగడం మరియు పాపం నుండి పశ్చాత్తాపపడటం రెండూ ఒకటే కాదు. అందుకే వారి మునుపు స్థితి విషయములో ఎలాగున మార్పు చెందారో కూడా తెలియపరిచారు. "మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి." (1కొరింథీయులకు. 6:11)


ప్రకటన గ్రంథంలో కూడా జారత్వంపై హెచ్చరిక ఉంది. ప్రకటన 2:14లో పెర్గములో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ప్రభువు బిలాము బోధను అనుసరించేవారిని గురించి మాట్లాడుతున్నాడు. బిలాము బోధ ద్వారా ఇశ్రాయేలీయులకు ఉరి పెట్టబడింది 

√ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడం.

√ జారత్వము చేయడం.

అందుకే ప్రకటన 2:16లో “కావున నీవు మారుమనస్సు పొందుము.” అని హెచ్చరిస్తున్నాడు. 

అలాగే ప్రకటన 2:20–22లో తుయతైరలోని సంఘాన్ని ఉద్దేశించి యెజెబెలు అనే స్త్రీ జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును దేవుని దాసులను బోధించి మోసపరచుచున్నదని చెబుతుంది.

ఆమెకు మారుమనసు పొందుటకు సమయం ఇచ్చినప్పటికీ, ఆమె తన జారత్వాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందలేదు. అందువల్ల ఆమెపై తీర్పు ప్రకటించబడింది.

8️⃣. *జారత్వాన్ని ఎలా జయించాలి?*

1. జారత్వం నుండి పారిపోవాలి - 1 కొరింథీయులకు 6:18

2. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి - 2 తిమోతి 2:22

3. పాపానికి దారి తీసే మార్గాన్ని వదిలిపెట్టాలి - సామెతలు 5:8

4. కన్నులను కాపాడుకోవాలి - యోబు 31:1; మత్తయి 5:28

5. హృదయాన్ని కాపాడుకోవాలి - సామెతలు 4:23

6. ఆత్మానుసారంగా నడవాలి - గలతీయులకు 5:16

7. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి - కీర్తన 119:9, 11

8. ప్రార్థనలో మెలకువగా ఉండాలి - మత్తయి 26:41

9. పరిశుద్ధమైన విషయాలపై మనస్సు నిలపాలి - ఫిలిప్పీయులకు 4:8

10. పాపాన్ని దాచకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి - సామెతలు 28:13

11. దేహాన్ని పరిశుద్ధాత్మ ఆలయంగా కాపాడుకోవాలి — 1 కొరింథీయులకు 6:19–20

12. శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు — రోమీయులకు 6:12–13

13. క్రీస్తును ధరించాలి — రోమీయులకు 13:14

14. మనస్సు నూతనపరచబడాలి — ఎఫెసీయులకు 4:22–24

15. జారత్వానికి సంబంధించిన చీకటి క్రియలలో భాగస్వాములు కాకూడదు — ఎఫెసీయులకు 5:11

16. తన శరీరాన్ని పరిశుద్ధతతో స్వాధీనపరచుకోవాలి — 1 థెస్సలొనీకయులకు 4:3–5

17. దేవుని చిత్తాన్ని చేయాలి — 1 థెస్సలొనీకయులకు 4:3

18. కామాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారం జీవించాలి — 1 పేతురు 4:2–3

19. క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా హృదయంలో నివసింపజేయాలి — కొలొస్సయులకు 3:16

20. ఇతరులను సంపూర్ణ పవిత్రతతో చూడాలి — 1 తిమోతికి 5:2

21. గత జీవితంలోని కామాలను అనుసరించకూడదు — 1 పేతురు 4:2–3

22. ఆత్మ చేత నడిపించబడాలి — గలతీయులకు 5:18

23. శరీర కోరికలను చంపివేయాలి — రోమీయులకు 8:13

24. క్రీస్తుకు చెందినవారు శరీరాన్ని దాని కోరికలతో సిలువ వేయాలి — గలతీయులకు 5:24

25. క్రీస్తు శరీర సభ్యులుగా జాగ్రత్తగా జీవించాలి — 1 కొరింథీయులకు 6:15

ముగింపు:

ఓ చదువరి... జారత్వము అనేది చిన్న విషయం కాదు. వివాహానికి ముందు అక్రమ లైంగిక సంబంధాలలో పడకూడదు. వివాహమైన తరువాత కూడా వివాహ బంధానికి వెలుపల సంబంధాలలో పడకూడదు. జారత్వాన్ని సాధారణమైన విషయంగా చూడకూడదు. గలతీయులకు 5:21 మరియు 1 కొరింథీయులకు 6:9–10 ప్రకారం జారత్వం కొనసాగేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు/కాలేరు. క్షణికమైన కోరిక కోసం శాశ్వతమైన ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు. కొన్ని క్షణాల పాపసుఖం కోసం జీవితకాల గాయాన్ని తెచ్చుకోవద్దు. దేహానికి ఆనందంగా కనిపించే దానికంటే ఆత్మకు మేలు చేసేదాన్ని ఎంచుకోవాలి. 

కాబట్టి బుద్ధిహీనుడిలా పాపం వెంట పరుగెత్తకుండా, బుద్ధిమంతుడిలా పాపం నుండి పారిపోదాం. మన దేహాన్ని అపవిత్రతకు అప్పగించకుండా, దేవుని మహిమకు అప్పగిద్దాం. పాపాన్ని దాచకుండా, దానిని విడిచిపెడదాం. దానిని బలహీనపరచడం కాదు చంపివేద్దాం.

“జారత్వమునకు దూరముగా పారిపోవుడి” (1 కొరింథీయులకు 6:18). “భూమిమీదనున్న మీ అవయవములను… జారత్వమును... చంపివేయుడి” (కొలస్సయులకు 3:5).


మీ ఆత్మీయులు 👪
9705040236

అశ్లీలత క్లిక్ చేయు

వ్యభిచారము త్వరలో

The churches of Christ greet you - Roma 16:16