"ప్రజలు ఎందుకు దేవుణ్ణి నిందిస్తారు?" (why do people blame God?)

ప్రజలు ఎందుకు దేవుణ్ణి నిందిస్తారు?

ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాటి సమాజములో క్రైస్తవులమని చెప్పుకుంటున్న అనేకమంది వారు శోధించబడినప్పుడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆయా శోధనలు ఎందుకు కలుగుతున్నాయో ఆలోచన చేయకుండా, అటువంటి సమయమలో దేవుని స్తుతించి, వారి తప్పులను సవరించుకుని దేవునిలో మరింత ఎక్కువ సమయం గడపాల్సింది పోయి తమని సృజించిన దేవున్నే నిందించే వారిగా ఉన్నారు.

ప్రజలు ఎందుకు దేవుణ్ణి నిందిస్తారు?


1)  శోధన సమయములో ఎవరిని నిందించాలో వారికి తెలియదు కనుక...

సాతాను మొదటినుండి దేవుని ప్రజలకు విరోధిగా ఉన్నాడు, సాతాను అంటేనే విరోధి (1 పేతురు. 5:8) అని గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయి వారు సాతాను చేత శోధింపబడుతున్నారని ఆ శోధన సహించువాడు ధన్యుడని (యాకోబు. 1:12) ఎరుగక దేవుణ్ణి నిందిస్తున్నారు.

● ఆదినుండి వాడు (అపవాది) నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. (యోహాను. 8:44).

మనము వాడి ఆలోచనలకూ, దేవునికి విరోధముగా ప్రేరేపించే మాటలకు  దూరముగా ఉండాలి ఎందుకనగా వాడు వేటగానివలె ఉన్నాడు కనుక..

● నిబ్బరమైన బుద్ధిగలవారై మెళకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాదిగర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. – (1 పేతురు. 5:8).
సాతాను మన ఆలోచనలను మారుస్తున్నాడని గ్రహించక శోధన కలిగినప్పుడు దేవుణ్ణి నిందిస్తున్నారు.

2) వారి వారి సొంత సమస్యలకు వారే బాధ్యత తీసుకోవడం ఇష్టంలేక...

అనారోగ్య పరిస్థితులు, మరణము, వివాహము, ఉద్యోగమూ, పిల్లలు లేకపోవడము ఇలాంటి ప్రతి సమస్యకు దేవుణ్ణి నిందిస్తున్నారు కాని ఆ సమస్యలకు గల కారణము మన యొద్దనే ఉందని వాటికి బాధ్యత మనమే వహించాలని వాటిని జయించే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడని గ్రహించక సాతాను బందీలోనికి వెళ్లిపోవుచున్నారు.

● మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును. – (గలతీ. 6:7-8).

3) దేవుణ్ణి నిందించడం సులభము కనుక....

సాధారణంగా మనుష్యులకు ఏమైనా శ్రమ కలిగితే పక్క వాళ్ళని నిందించడం, వారిని తప్పు పట్టడం సహజం అయితే మనుష్యులు నిందను భరించడానికి ఇష్టపడక తిరిగి సమాధానము చెప్తారు వాదనకు దిగుతారు కాబట్టి వారు, దేవుడు వాదించడని, వెంటనే సమాధానము ఇవ్వడని తలంచి సులభముగా దేవునిపై నింద వేస్తున్నారు కాని మన దేవుడు ఆలస్యము చేయువాడు కాదు చూచి చూడనట్టు ఉండువాడు కాదు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పులో సమాధానము చెప్పాల్సి వస్తుందని గ్రహించక దేవుని నిందించి పాపము చేస్తున్నారు. అలాంటి వారికి గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.

● కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీయెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. – (2 పేతురు. 3:9).
● ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యలకు ఆజ్ఞాపించుచున్నాడు. – (అపొ.కార్య. 17:30).

అవును దేవుడు మన పట్ల దీర్ఘశాంతము వహిస్తున్నాడు కాని ఏదో ఒక రోజు ఎవరి క్రియల చొప్పున వారికి సమాధానము తెలియజేస్తాడని గ్రహించి మాటలను అదుపులో ఉంచుకోవాలి.

● ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినవాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. – (2 కొరింధి. 5:10).

దేవుడు ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగజేసాడు మన జీవితములో మనము ఎంచుకునే మార్గములను మనకే వదిలివేసాడు అయితే మంచి మార్గములో నడిస్తే దేవుని చిత్తములో ఉంటాము చెడు మార్గములో నడిస్తే శిక్షకు పాత్రులమవుతామని గ్రహించకుండా మనము చేసిన తప్పులకి వచ్చే ప్రతి ఫలములకు సులభముగా దేవున్ని నిందిస్తున్నాము.

●నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులు గా పిలుచుచున్నాను. (ద్వితియో. 30:19).
● యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. – (యెహోషువా. 24:15).
● ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. – (మత్తయి. 7:13).

4) దేవుడు సమస్తమును సృజించాడు కాబట్టి  ఈ లోకములో మనకు కలిగే ప్రతి సమస్యకు ఆయనే  కారణమని తలంచి...

దేవుడు మానవుల మేలు కొరకు సమస్తమును కలుగజేశాడు కాని మనుష్యులు వివిధ తంత్రములు కల్పించుకొని వారి ఆలోచనల వలనే శోధించబడుతున్నారని గ్రహించకుండా దేవ దూషణ చేసి ఆయన నామమును అవమాన పరుస్తున్నారు.

● వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. – (కీర్తన. 106:29).
● దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు. (ప్రసంగి. 7:29).
● శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, జోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు. తాను సృష్టించినవాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్పప్రకారము కనెను. (యాకోబు. 1:17).

మన ప్రవర్తనకు మనమే (మన ఆలోచనలు) కారణము లేదా మనదే బాధ్యత.

● ఆయన ప్రతినానికి వాని వాని క్రియలచొప్పున ప్రతిఫలమిచ్చును. సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్ణీతికి లోబడువారిమీదకి ఆయన ఉగ్రతను రౌద్రమును కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. – (రోమా. 2:6-8).

పరిశుద్ధ గ్రంథములో తెలుపబడిన యోబు గురించి మనకందరికీ తెలుసు అతడు యధార్ధముగా జీవించి లోకములో ఎవరు శోధింపబడని విధముగా చాలా అధికముగా సాతాను చేత శోధింపబడి వెంటనే ఆది దేవుని వలన కలిగే పరీక్షని గ్రహించగలిగాడు ఊహించలేని స్థాయిలో ఆశీర్వదింపబడ్డాడు. సోదరులారా, యోబుకు కలిగిన వేదనతో పోలిస్తే మన సమస్యలు చాలా చిన్నవి.

● నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని యెంచుకొనుడి. – (యాకోబు. 1:2-3).

ప్రియ సహోదరుడా, సహోదరీ నీ జీవితములో శోధనలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేశావా?
నీవు దేవుని యెదుట ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు వేరెవరో చెప్పక్కర్లేదు నీ మనసే నీకు సాక్షిగా ఉంది.
నీ విశ్వాసము పరీక్షించబడుటకు నీవు శోధించబడుతున్నావా? లేదా నీ పాపముల నిమిత్తము దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడా? ఆలోచన చేయు. నీ ఇంట్లో సమస్య ఉందా? దేవునికి ప్రార్దన చేయు. నీతిగా జీవించిన వారెవరైనా నీ కుటుంబములో మరణించారా? క్రీస్తునందు మృతి చెందినవారు ధన్యులని విశ్వసించు. కాని నీవు దేవుని అడిగేటప్పుడు మొదట నీ హృదయము దేవుని దృష్టికి నీతిగా ఎంచబడాలని గ్రహించు. ఎందుకనగా...

● దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైన దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. – (యోహాను. 9:31).

ప్రియులారా, శోధించబడినప్పుడు దేవుని నిందించకుండా ఆయనకు మరి దగ్గరగా ఉండి ఆయనను స్మరించి ఆనందముతో దేవుని సేవించిన యెడల అత్యధిక మేలులు పొందుకుంటాము.

● యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. (యోబు. 42:12-16).

● సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును. – (1 కొరింధి. 10:13).

దేవుణ్ణి నిందించి నీ సహోదరుని మనసు బలహీనపడేలా ప్రవర్తించి దేవుని ఉగ్రతకు దాసులు కావద్దు.

● శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానముచేసిన జీవకిరీటము పొందును. – (యాకోబు. 1:12).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  .

Share this

Related Posts

Previous
Next Post »

3 comments

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16