"విధేయత" (Obey)

విధేయత 




ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

విధేయత అనగా "లోబడుట, భయము కలిగి యుండుట, చెప్పిన పని చేయుట".  

ప్రియులారా నేటి క్రైస్తవులలో అనేకమంది దేవునికి విధేయత చూపించే విషయములో చాలా వెనకబడి ఉన్నారు. మన జీవితాలలో విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ఉదా: ఒక ఉద్యోగి తన అధికారికి విధేయత చూపిస్తేనే తన జీతము తాను పొందుకోగలడు, కుటుంబములో పిల్లలు తమ తలితండ్రుల యెడల విధేయత కలిగియుంటేనే తాము ఆశపడినవి అనుభవించగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కలవు. కేవలము ఈ భౌతిక సంబంధమైన జీవితమూ కొరకే ఈ లోకస్థుల యెడల మనము ఇంత విధేయత చూపించగలితే మనలను సృజించి, తన కుమారుని పంపి ఆయన ద్వారా రక్షణను అనుగ్రహించి, తన కుమారునితో సమాన వారసత్వాన్ని ఇచ్చిన దేవునికి మనమెంత విధేయత చూపించాలో ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది.  

మనము జ్ఞానయుక్తముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విషయాలలో మనము విధేయత చూపించి, లోబడాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి విధేయత చూపించాల్సిన విషయాలలో అతి ప్రాముఖ్యమైన సంగతులను ఈ అంశము ద్వారా ఆలోచన చేద్దాము.

A). క్రీస్తు సువార్తకు విధేయత చూపాలి :


తన కుమారుడైన క్రీస్తు సువార్తకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము తన కుమారుని ద్వారా మరియు అపోస్తులుల బోధ ద్వారా ఏ ఏ సంగతులు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడియున్నవో వాటన్నిటికి విధేయత చూపి తండ్రిని సేవించాలని ఆశపడుతున్నాడు.

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:3-4).

● ఏలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను,... (2 కొరింధి. 9:13).

మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. (1 పేతురు. 1:22).

●  మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వముగా లోబడిన వారై. (రోమా. 6:17).

B). దేవుని వాక్యము చదువుటలోనూ, నేర్చుకొనుటలోనూ విధేయత చూపాలి :


మనలో అనేకమంది దేవుని వాక్యము చదివే విషయములోనూ, వాటిని అభ్యసించి నేర్చుకొను విషయములోను అశ్రద్ధ చూపిస్తూ, తమ సొంత పనుల నిమిత్తము దేవుని పనిని వాయిదా వేస్తున్నారు. దేవునికి విధేయత చూపలేకపోతున్నారు అలాంటి వారికి గ్రంథము చెప్పే సమాధానము,

● వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. – (రోమా. 1:28).

● నా జనులు అవివేకులువారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలుచేయుటకు వారికి బుద్ధి చాలదు. – (యిర్మియా. 4:22).

● యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. (సామెతలు. 1:7).

● నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను. – (1 కొరింధి. 15:34).

● దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. – (తీతుకు. 1:16).


C). దేవుని మాటలను బోధించే విషయములో విధేయత చూపాలి :


ప్రియులారా ఈనాడు అనేకమంది క్రైస్తవులు దేవుని వాక్యమును నేర్చుకొనుటలో చూపించే ఆసక్తి ఇతరులకి బోధించే విషయములో చూపించలేకపొతున్నారు. కాని మనలో ప్రతీ ఒక్కరు దేవునికి విధేయత చూపించి, ఆయన మాటలను లోకమునకు తెలియజేయు విషయములో పాలిభాగస్థులమవ్వాలని గ్రంథము సెలవిస్తుంది.

● నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము. (2 తిమోతి. 4:12).

● మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయ కులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి. – (హెబ్రీ. 13:7).

● ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును. – (1 కొరింధి. 4:12).

● పుర్రు కుమారుడును బెరైయదేశస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకైయలలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమొథెయును, ఆసియ దేశస్థులైన తుకికును, త్రోపిమును అతనితో కూడ వచ్చిరి. (అపొ.కార్య. 20:4).

● క్రీస్తుయేసునందు నాతోటి ఖైదియైన ఎపఫ్రాయు, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకాయు వందనములు చెప్పుచున్నారు. – (ఫిలోమోను. 1:24).

● తీతు ఎవడని ( యెవరైన అడిగినయెడల) - అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునైయున్నాడనియు; - మన సహోదరులెవరని ( అడిగినయెడల) - వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను. (2 కొరింధి. 8:23).

D). క్రీస్తు నిమిత్తము శ్రమలు పొందే విషయములో విధేయత చూపాలి :


సహోదరీ, సహోదరులారా నేటి క్రైస్తవులమైన మనము చాలా విషయాలలో విధేయత చూపగలుగుతున్నాము కాని చిన్న శోధన కలిగినా, శ్రమలు కలిగినా దేవునికి విధేయత చూపకుండా, ఆ శోధనను మహా ఆనందమని ఎంచుకొనక అపవాదికి లోబడిపోవుచున్నారు. క్రీస్తు వలె ప్రతి యొక్క శ్రమను జయించి, క్రీస్తు ఏలాగైతే దేవునికి విధేయుడై మరణమును జయించాడో అలాగే మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.

● తాను (యేసు) శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. – (హెబ్రీ. 2:17).

● క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింస పొందుదురు. (2 తిమోతి. 3:12).
క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలనుబట్టి నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. (1 పేతురు. 2:21).

● శిష్యుల మనస్సులను దృఢపరచి - విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. (అపొ.కార్య. 14:22).

● కాబట్టి ఇకను సహింపజాలక అతేనైలో మేమెంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, యీ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమొథెయును పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినవారమని మీరెరుగుదురు. (1 ధేస్సలోని. 3:3).

● మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి. – (1 పేతురు. 3:14).

● క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. – (2 కొరింధి. 4:18).

నా ప్రియ సహోదరులారా, మనము అడిగిన ప్రతీ ఈవిని దేవుడు మనకు దయజేస్తున్నాడు, మన కుటుంబములోను, పనులలోను, ఆరోగ్యములోను, ఇలా ఇహ సంబంధమైన ప్రతి విషయములోను మనకు అన్నియు సమకూరుస్తున్నాడు. అంతేకాదు మన ఆత్మ నశించిపోకుండా క్రీస్తును ఈ లోకమునకు పంపి (యోహాను. 3:16-17), ఆయన సిలువ మరణము ద్వారా మనలను విమోచించాడు (కొలస్సి. 1:14). అటువంటి దేవుడు మన నుండి విధేయత మాత్రము కోరుకుంటున్నాడు, తన మాటలకు లోబడాలని ఆశపడుతున్నాడు.  

కాబట్టి ప్రియులారా, ఈ సంగతులు మాకెందుకు అని అనుకుని దేవుని యెడల అవిధేయత చూపిస్తూ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో ఆ విషయములను ప్రక్కన పెట్టి దేవుని యెడల విధేయత లేకుండా ఆయనకు లోబడకుండా మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఒకానొక రోజున చాలా బాధపడే అవకాశము ఉంది కనుక పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన సంగతులను ఆలోచన చేయవలసినదిగా నన్ను నేను హెచ్చరిక చేసికొనుచున్నాను మీకు మనవి చేయుచున్నాను.

యేసు ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను. – (ఫిలిప్పి. 2:8). 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"ధనము అశాశ్వతము" (Riches Are Temporary)

ధనము అశాశ్వతము



పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు.

నేటి కాలములో అనేకమంది క్రైస్తవులు ఈ లోకములో ధనము కోసము ప్రాకులాడుతూ, అధికంగా ధనము సంపాదించుకొనుటకు  వారి ఆలోచనలు, వారి సమయమును వినియోగిస్తూ, దేవునికి ఇవ్వవలసిన విలువైన సమయమును భౌతిక సంబంధమైన వాటి కొరకు కేటాయిస్తూ వారికి వారే నాశనమును కొనితెచ్చుకొనుచున్నారు.

ప్రియులారా ఈ లోకస్తులు భౌతిక సంబంధమైన జీవితము కోసము ధనము మీద ఆశపడుతున్నారు. ఎందుకనగా వారికి ధనము అశాశ్వతమని  తెలియదు.  నేటి క్రైస్తవులమైన మనకు ధనము అశాశ్వతమని తెలిసినా, ఈ భూమి మీద ధనము కూర్చుకొనకూడదని ఎరిగిన కూడా ఈ లోకస్తులవలె ఆలోచన చేసి, ధనము శాశ్వతమని భావిస్తూ కొన్ని సందర్భములలో క్రీస్తు మాటలను సైతము ప్రక్కన పెట్టి ధనము కొరకు మాత్రమే ప్రయాసపడటం చాలా బాధాకరం.

【 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును. 】– (సామెతలు. 23:4-5).

ధనము సంపాదించుకోవాలని కోరిక కలిగిన యెడల దానిని విడిచిపెట్టుము ఎందుకనగా ధనము అశాశ్వతము, ఆది ఎక్కువ కాలము మన దగ్గర నిలిచియుండదు, పక్షి ఎగిరిపోవునట్లుగా ఆది ఎగిరిపోవునని ఎంతో గొప్ప ధనవంతుడై, ఈ భూమి మీద ఏ రాజుకి లేనంత ఐశ్వర్యమును పొందుకున్న సొలోమోను సైతము ధనము సంపాదించుకకొనుట వ్యర్థమని తన ఆలోచనలను పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేయడము జరిగినది.

ధనమును గూర్చి పరిశుద్ధ గ్రంథములోని  అనేక వచనములు మనలను హెచ్చరిక చేయుచున్నవి వాటన్నిటిని ఆలోచన చేసి మనలో లోపాలను సరిచేసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాము.

ఈ భూమి మీద ధనమును ఎందుకు సమకూర్చుకొనకూడదు?

1) ధనము అశాశ్వతము కనుక :

● ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?. – (సామెతలు. 27:24).

● మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. (కీర్తన. 39:6).

2) ధనము మనలను మరణము నుండి తప్పించాడు కనుక :

● భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.(సామెతలు. 10:2).

3) ధనము మనలను వంచకులుగా చేయును కనుక :

● వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.(సామెతలు. 28:6).

4) ధనవంతులగుటకు ప్రాకులాడే ప్రయత్నములో దేవునికి విరోధముగా ఆలోచన చేసే అవాకశమున్నది కనుక :

● మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును. (సామెతలు. 13:11).

● అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.(సామెతలు. 21:6).

5) ధనము మనలను గర్విష్టులుగా చేయును కనుక :

● బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. (కీర్తన. 62:10).

6) ధనము మనలను పరిపూర్ణులుగా చేయదు కనుక :

● అందుకు యేసు -పరిపూర్ణుడవగుటకు నీవు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును;నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. (మత్తయి. 19:21).

7) ధనము మనలను నాశనము చేయును కనుక :

● మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి. (యాకోబు. 5:3).

8) ధనము విస్తరించుట వలన మనకు జీవము కలుగదు కనుక :

● ఆయన వారితో - మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుటవలన అది వాని జీవమునకు మూలముకాదనెను. (లూకా. 12:15).

9) ధనము వలన శోధనలు కలుగును కనుక :

● ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. – (1 తిమోతి. 6:9).

10) పరలోకమునందు మనకొరకు సిద్దపరచబడిన ధనమును పొందుకోవాలంటే :

● యేసు అతని చూచి అతని ప్రేమించి - నీకు ఒకటి కొదువగా నున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. (మార్కు. 10:21, లూకా. 18:22).

11) ధనము వలన దేవునికి హృదయమును ఇవ్వలేము కనుక :

● నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. (మత్తయి. 6:22).


క్రైస్తవుడు ధనమును సంపాదించుకొనకూడదా?

ప్రియులారా పైన వ్రాయబడిన వచనములను బట్టి క్రైస్తవులమైన మనము ఈ లోకస్తులవలె ధనము కొరకు ప్రాకులాడకూడదు అని తెలుస్తుంది. అయితే చాలామందికి ఒక సందేహము కలుగవచ్చును. ధనమును సంపాదించకుండా కుటుంబమును ఏ విధముగా పోషించాలి? ఈ లోకములో జీవితమును సంతోషంగా గడపాలంటే ధనము చాలా కీలకమైనది కదా అనే ఆలోచన కలుగవచ్చును. వాటన్నిటికి గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.

దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా చేసిన వాగ్దానములు :

» భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. - (మత్తయి. 6:19).

» నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చియైనను, చింతింపకుడి, ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? (మత్తయి. 6:25).

» ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టులు కారా? (మత్తయి. 6:26).

» మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తు మూరెడు ఎక్కువ చేసికొనగలడు? వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు. – (మత్తయి. 6:27-28).

» నేడు ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.(మత్తయి. 6:30).

» కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును.(మత్తయి. 6:33).

» రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును. (మత్తయి. 6:34).

ప్రియ సహోదరీ, సహోదరులారా మన దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానములను మనయెడల చేసియుండగా  మనము కేవలము ఇహలోక సంబంధమైన జీవితము కొరకు ప్రయాసపడుతూ దేవునికి ఇవ్వవలసిన విలువైన సమయమును వృధాగా ఖర్చు చేస్తున్నాము. దేవుడు తన కుమారుని ద్వారా తెలియజేసినదేమనగా “మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని” వెదకండి అప్పుడు మీకు కావలిసినవన్నీ మీకు అనుగ్రహింపబడును.

ప్రియులారా మన కుటుంబమును పోషించుటకు, మన జీవితమును సంతోషముగా గడుపుటకు  ఆయన సమస్తమును దయచేయువాడు (అపొ.కార్య. 17:27), మన దేవుడు నమ్మదగినవాడు (2 కొరింధి. 1:18, 2 తిమోతి. 2:13). ఈ లోకపు ధనము అశాశ్వతము (సామెతలు. 27:24).

క్రైస్తవులమైన మనము కష్టపడి పని చేయాలి, అట్టి పని వాడు అట్టి జీతానికి పాత్రుడని (2 థెస్సలొనీ. 3:10, రోమా. 4:4) గ్రంథము సెలవిస్తుంది. నిజమే. కానీ అదేపనిగా ఈ జీవితకాలము మట్టుకే మన కొరకు, మన తోటి వారికొరకు ధనము సంపాదించుకునే పనిలో పడి, అశాశ్వతమైన దీనిని కూర్చుకుంటూ దేవున్ని దూరముగా పెట్టమని కాదు.

దేవుడు మనలను ఆశీర్వదించి మనకు ధనమును అనుగ్రహిస్తున్నాడంటే అందులో మొత్తము నీ భాగమని అనుకోకు కొంత కుటుంబమునకు, కొంత దేవుని పనికి లేదా అక్కర గలవానికి ఉపయోగించాలని లేఖనములు చెప్పుచున్నవి.

» మేము మీయొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా.(2 థెస్సలొనీ. 3:10).

» అపవాదికి చోటియ్యకుడి; దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను. – (ఎఫెసీ. 4:27-28).

» భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మినవాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచువచ్చిరి. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. (అపొ.కార్య. 4:34-35).

» అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని దివారాత్రము కష్టముచేసి జీవనముచేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.(1 థెస్సలొనీ. 2:9).

» మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలినవాడనైతిని. (2 కొరింధి. 11:8).

» వాస్తవమైన జీవమును సంపాదించుకొనునిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్ క్రియలు అను ధనముగలవారును, ఔదార్యముగలవారును, (తమ 
ధనములో) ఇతరులకు పాలి వారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము. (1 తిమోతి. 6:18).

» జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. – (లూకా. 19:8).

» ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును. (1 తిమోతి. 5:8).

కావున ప్రియులారా, పరలోకమందు ధనము కూర్చుకునే పనిలో కాకుండా ఈ లోకము మట్టుకు మాత్రమే ధనము కూర్చుకునే వారిగా ఉన్నచో, ఈ క్షణమే దేవుని హెచ్చరికను లక్ష్యపెట్టుము.

★ అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. – (లూకా. 12:17-21).

★ ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి. మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పుపెట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి. – (యాకోబు. 5:1-3).

★ ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. – (లూకా. 18:24-25).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"యోసేపు" (Joseph)

యోసేపు

పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

పరిశుద్ధ గ్రంథమునందు గల పాత నిబంధనలో తెలియజేయబడిన యాకోబు కుమారుడైన యోసేపు గూర్చి క్రైస్తవులమైన మనకందరికీ తెలుసు అయితే ఆయన జీవితము నుండి మనము నేర్చుకోవలసిన విషయములు, ఆయన దేవుని చిత్తములో నడిచిన విధానము ఇంకా అనేక విషయములు ఈ అంశము ద్వారా మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.  

అబ్రహాము మనుమడును, ఇస్సాకు రెండవ కుమారుడును అయిన యాకోబు  రెండవ భార్యయైన రాహేలునకు పుట్టిన మొదటి సంతానము యోసేపు. యాకోబుకు కలిగిన కుమారుల వరుసలో చూస్తే యోసేపు స్థానము పదకొండు.

కుటుంబము :


● యోసేపు చిన్నతనములోనే తన తల్లియైన రాహేలు మరణము నొందుటచేత అతడు తన తండ్రి భార్యలైన బిల్హా మరియు జిల్ఫా  కుమారులతో పెరిగెను.

» అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను.(ఆది. 37:2).

● యోసేపుకు పదకొండుమంది సహోదరులు, ఒక సహోదరీ.

» యోసేపు తర్వాత రాహేలునకు పుట్టిన కుమారుడు బెన్యామీను, తన తండ్రి భార్యలైన లేయా, బిల్హా, జిల్ఫా  అను వారికి పుట్టిన కుమారులు పదిమంది (10), కుమార్తె దీనా. – (ఆది. 35:23-27, 30:21).  

● యోసేపు భార్య పేరు ఆసెనతు, వీరికి ఇద్దరు కుమారులు, మనష్షే మరియు ఎఫ్రాయిము.

» ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.(ఆది. 41:45).

» అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.(ఆది. 41:51-52).

ప్రేమ – ద్వేషం :

యోసేపు చిన్నతనము నుండి తన జీవితములో ప్రేమను చూసాడు అలాగే ద్వేషమును చూసాడు.

● యోసేపు తన తండ్రయైన యాకోబు ఇష్టపడి వివాహము చేసికొన్న రాహేలునకు పుట్టిన కుమారుడు మరియు యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక యాకోబు మిగతా కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించెను.

» యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.(ఆది. 37:3).

● తమ తండ్రి తమ తమ్ముడిని ఎక్కువగా ప్రేమించుట చేత సొంత అన్నలే యోసేపును ద్వేషించి పగను పెంచుకున్నట్టుగా గ్రంథములో చూడగలము.

» అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.(ఆది. 37:4).

శోధన :


● యోసేపు సొంత అన్నయ్యలే యోసేపు మీద పగపట్టి తమ తండ్రికి తెలియకుండా వర్తకులకు అమ్మివేసిరి.

» మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీ యులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి.(ఆది. 37:28).

● తన యజమానుడైన పోతీఫరు భార్య విషయములో శోధింపబడ్డాడు.

» అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. – (ఆది. 39:7).

» దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.(ఆది. 39:10).

● యోసేపు చేయని తప్పుకు రెండు సంవత్సరములకు పైగా చెరసాలలో గడిపెను.

» అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెర సాలలో ఉండెను. (ఆది. 39:20).

తగ్గింపు :


● తన సొంత సహోదరులు తనని ద్వేషించినప్పుడు కానీ, తనని అమ్మివేసినప్పుడు కానీ ఎక్కడా ఒక్క మాటైన ఎదురు చెప్పలేదు ఎందుకిలా చేస్తున్నారని కూడా అడగలేదంటే తను ఎంత తగ్గించుకుని జీవించాడో మనకు తెలుస్తుంది.
(ఆదికాండము 37వ అధ్యాయము చదువగలరు).

● మరొక గొప్ప సంగతి ఏమిటంటే తన యజమానుని భార్య తనతో శయనించలేదని, అతనిపై తప్పుడు ఆరోపణ చేసినప్పుడు కూడా తాను తప్పు చేయలేదని ఒక్కమాటైన ఎదురు చెప్పలేదు, మౌనముగా చెరసాలకు వెళ్ళాడు, ఈ విషయములోనే తెలుస్తుంది తన జీవితములో ఎంతగా తగ్గించుకున్నాడో.
(ఆదికాండము 39వ అధ్యాయము చదువగలరు).

● తనపై కుట్రపన్ని తనని అమ్మివేసిన సహోదరులు కరువుకాలములో తన దగ్గరకు వచ్చినప్పుడు “నన్ను ఎందుకు అమ్మివేసారు” అని అడగలేదు, తనని చంపుటకు చూసిన వారిపై కొంచెము కూడా కోపము తెచ్చుకోలేదు, అప్పటికి ఐగుప్తు దేశములో తనకున్న అధికారమును బట్టి అతిశయించలేదు.  చాలా గొప్పగా తగ్గించుకుని తనవారితో అతడన్న మాటలు చూస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది.

 అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. – (ఆది. 45:5).

దేవుని సంకల్పము :


యోసేపు తన సహోదరులచేత శోధింపబడ్డాడు ఒకానొక సమయములో తనని ఎక్కువగా ప్రేమించే తన తండ్రి కూడా యోసేపు చెప్పిన కల విని కోపము తెచ్చుకున్నట్టుగా చూడగలము కానీ దేవుడు మాత్రము అబ్రహామునకు చేసిన వాగ్ధానమును నెరవేర్చుటకు యోసేపును ఎన్నుకున్నాడని చాలా స్పష్టముగా తెలుస్తుంది.

● ఐగుప్తు దేశములో యోసేపు యొక్క స్థితిని మరియు తన కుటుంబమంతా యోసేపు దగ్గరికి వచ్చి అతనికి సాగిలపడతారని దేవుడు ముందుగానే తన సంకల్పమును కల ద్వారా యోసేపునకు తెలియజేసెను.

» అతడు వారినిచూచినేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచినిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.(ఆది. 37:6-7).

» అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను. తన తండ్రితోను తన సహోదరుల తోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అత నితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుడుమా అని అతని గద్దించెను. – (ఆది. 37:9-10).

● ఐగుప్తు రాజైన ఫరో కనిన కలకు అర్థము, దేవుడు యోసేపు ద్వారా బయలు పరచి, ఐగుప్తు దేశములో యోసేపునకు అధికారమిచ్చి ఇశ్రాయేలు ప్రజలను కరువునుండి తప్పించెను.
(ఆదికాండము 41వ అధ్యాయము చదువగలరు).

విజయము :    


యోసేపునకు ఎన్ని శోధనలు కలిగినప్పటికీ, ఎంత ద్వేషించబడినప్పటికీ, తన జీవితమునకు సంబంధించిన అన్ని విషయములలోనూ విజయము పొందాడు.

● తన సహోదరుల చేత అమ్మివేయబడినప్పటికీ తన స్థితి దిగజారలేదు. తనను కొనుక్కున్న యజమానుని ఇంటికి విచారణకర్తగా నియమింపబడ్డాడు.

» యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.(ఆది. 39:4).

● తన యజమానుని భార్య తప్పుడు ఆరోపణ వలన చెరసాలలో పెట్టబడినప్పటికీ ఆద్భుతంగా విడిపింపబడి ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమింపబడ్డాడు.

» నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరోచూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడువంద నము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.(ఆది. 41:40-43).

● ఏ సహోదరులైతే తనను ద్వేషించి అమ్మివేసారో, వారే తన ముంగిట వంగి సాగిలపడేంత స్థాయికి చేరుకోగలిగాడు.

» యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి. (ఆది. 43:26).

ప్రియ సహోదరుడా, సహోదరీ యోసేపు తన జీవితములో ఏ విధముగా ప్రేమించబడ్డాడు, ఏ విధముగా ద్వేషించబడ్డాడు, ఏ విధముగా శోధించబడ్డాడు తెలుసుకున్నాము చివరికి ఏ విధముగా విజయమును పొందుకున్నాడో కూడా పైన వ్రాయబడిన వచనముల ద్వారా తెలుసుకున్నాము కానీ ఇక్కడ అతి ముఖ్యమైన సంగతిని గూర్చి నేటి క్రైస్తవులమైన మనము ఆలోచించాల్సిన అవసరము చాలా ఉన్నది. 

అదేమనగా ఇంతగా శ్రమలు పొంది, అనేకమార్లు అపవాదిచేత బాధింపబడిన యోసేపు అంత గొప్పగా ఆశీర్వదింపబడుటకు గల కారణము, అతను నమ్మిన సిద్ధాంతము ఏంటో తెలుసా?

1) చిన్నప్పటి నుండి దేవుని యెడల భయభక్తులు కలిగి యున్నాడు తప్పుని ఖండించినవాడిగా ఉన్నాడు.

★ యోసేపు వారి (సహోదరుల) చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు.(ఆది. 37:2).

2) యోసేపు దేవుని యెదుట తనను తాను కనపరచుకున్న విధానమును బట్టి, దేవుని యెడల చూపిన భక్తిని బట్టి దేవుడు ప్రతి విషయములోను యోసేపునకు తోడుగా ఉండెను.

★ యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. – (ఆది. 39:2-3).

★ యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదిం చెను. – (ఆది. 39:5).

★ ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరిగాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి,..... – (అపొ.కార్య. 7:9-14).


3) యోసేపు యౌవనములో ఉన్నప్పుడు పోతీఫరు భార్య శయనించమనగా దేవునికి విరోధముగా పాపము చేయను అన్నాడంటే అతడు దేవుని ఎంతగా ప్రేమించాడో మనకు తెలుస్తుంది.

★ నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. (ఆది. 39:9).

4) యోసేపు చేయని తప్పుకు చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుని దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు.

★ యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.(ఆది. 39:21).

5) ఐగుప్తు దేశములో చాలా అత్యున్నత స్థానములో ఉన్నప్పటికీ తన సహోదరుల దగ్గర మరియు దేవుని దగ్గర తగ్గించుకుని తన ప్రవర్తనను కనపరచుకున్నాడు.

★ మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశ ములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపిం చెను. (ఆది. 45:6-7).

6) యోసేపు తన విశ్వాసమును బట్టి ముందుకు కొనసాగాడు తన ప్రజలను రక్షించగలిగాడు.

★ యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పుడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములనుగూర్చి వారికి ఆజ్ఞాపించెను. (హెబ్రీ. 11:22).



ప్రియులారా, మనము కూడా మన జీవితములో ఎన్ని శోధనలు వచ్చినా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా యోసేపు వలె దేవునిని విడిచిపెట్టకుండా, ప్రతీ విషయములోను తగ్గించుకుని ఏది జరిగినా ఆది దేవుని చిత్తమే అని తలంచి ముందుకు కొనసాగితే మనకు ఓటమి అనేది ఉండదు. ఒక్కటే మనము నమ్మితీరాలి దేవుడు ఏమి చేసినా మన మేలు కొరకే చేస్తాడు మన విశ్వాసము తెలుసుకొనుటకే పరీక్షిస్తాడని గ్రహించగలిగితే మన జీవితము కూడా యోసేపు జీవితము వలె అత్యున్నతంగా ఉంటుందని నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  
The churches of Christ greet you - Roma 16:16