"ప్రభురాత్రి భోజనము" (Lord's Supper)


"ప్రభురాత్రి భోజనము"


పరిశుద్ధులుగా  ఉండుటకు పిలువబడినవారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

 ప్రియులారా, నేటి సమాజములో అనేకమంది క్రైస్తవులు ప్రభురాత్రి భోజన విషయంలో వివిధ ఆలోచనలు, పద్దతులు కలిగియున్నారు. కొన్ని సంఘాల వారు ప్రభురాత్రి భోజనమును నెలకొకసారి తీసుకోవాలని, మరికొందరు సంవత్సరానికొకసారి తీసుకోవాలని, ఇంకొంతమంది క్రిస్టమస్ పండుగరోజు తీసుకోవాలని, పాప క్షమాపణ కలుగుటకు ప్రభువు బల్లలో చేయి పెట్టాలని సొంత అభిప్రాయాలు కలిగి 1 కొరింధి 11వ అధ్యాయము 23 నుండి 34 వచనములను సరిగ్గా అర్థము చేసుకోలేకపోతున్నారు.

ఈ ప్రభురాత్రి భోజనము అంశము ద్వారా పైన చెప్పబడిన విషయములను మరియు కొన్ని అతి ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి  పరిశుద్ధ గ్రంధమును పరిశీలన చేసి అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము.

★ "ప్రభురాత్రి భోజనము" అనగా రాజ్య సంబంధమైన భోజనము. రాజ వంశీకులకు మాత్రమే అనుగ్రహింపబడినది ఇంకా చెప్పుకోవాలంటే రాజు యొక్క సముఖములో ఆయనతో కలిసి పాలు పంచుకొనుటకు అర్హత కలిగిన భోజనము లేదా రాజుతో మరియు సంఘముతో  సహవాసము కలిగిన భోజనము.

ఉదాహరణకు :-

1) ఏ మాత్రము అర్హత లేని మెఫీబోషేతుకు రాజైన దావీదు సముఖములో భోజనము చేయుటకు కలిగిన అవకాశము.

 » అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా. అతడు నమస్క రించిచచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను. – (2 సమూయేలు. 9:7-8).


2) షేబదేశపు రాణి రాజైన సొలోమోను భోజన బల్లను చూసి ఆశర్యపడుట.

 » షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై. – (1 రాజులు. 10:4-5).


ఇటువంటి  గొప్ప రాజ విందులో పాలు పొందుటకు ఎటువంటి అర్హత లేని మనకు తండ్రియైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా సహవాసమును ఏర్పాటు చేసి (1 కొరింధి. 1:9), తన కుమారుని రాజ్యములో వారసులునుగా చేసి (1 పేతురు. 2:9), ఆ రాజు యొక్క విందులో అనగా ప్రభురాత్రి భోజనములో చేయి పెట్టుటకు అవకాశమును దయచేసెను (1 కొరింధి. 11:23-32). కాని ప్రియ సహోదరుడా, పైన పేర్కొనబడిన రాజ విందులో పాలు పంచుకొనుట నామమాత్రమే గానీ క్రీస్తువారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రాజ విందు శాశ్వతమైనది, నిత్యమూ క్రమము తప్పకుండా కొనసాగించేదని క్రైస్తవులమైన మనము మొదట గ్రహించాలి.


NOTE:- మన ప్రభువైన యేసుక్రీస్తువారు తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యులతో కలిసి రెండు రకాల భోజనాలలో పాలు పొందుట మనము చూడగలము. 

● ఒకటి పస్కా భోజనము,
● రెండవది ప్రభురాత్రి భోజనము.

 » వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – (మత్తయి. 26:26-27).

 » వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – (మార్కు. 14:22-23).


ప్రభురాత్రి భోజనము ఎప్పుడు తీసుకోవాలి..?

ఈ ప్రభురాత్రి భోజనమును ఒక్కొక్క సంఘము ఒక్కోరోజు తీసుకుంటుంది. కాని ఆదిమ అపొస్తలులు "ప్రతి ఆదివారము" తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంధములో స్పష్టముగా కనబడుచున్నది..

 » "ఆదివారమున" మేము రొట్టె విరుచుటకు కూడినపుడు. - (అపొ.కార్య. 20:7).

ప్రియులారా, ఆదివారము నెలకొకసారి వస్తుందా లేక సంవత్సరానికొకసారి వస్తుందా లేదా వారమునకు ఒకసారి వస్తుందా నేటి క్రైస్తవులు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది.  చాలామంది ఆదివారము సెలవు దినము కాబట్టే ఆరోజు నిర్ణయింపబడిందనే ఆలోచనలో ఉన్నారు కాని ఆదివారమునకు ఉన్న ప్రాముఖ్యతను దేవుని గ్రంధములో చూడగలిగితే,


 » యేసు పునరుత్థానుడై తిరిగి లేపబడిన దినము "ఆదివారము". – (మత్తయి. 28:1; మార్కు. 16:2; లూకా. 24:1; యోహాను. 20:1). 

 » క్రీస్తు సంఘము ప్రారంభమైన దినము "ఆదివారము". – (అపొ.కార్య. 2:38-41).

 » క్రీస్తు వారు పరలోకమునకు కొనిపోబడిన పిమ్మట అపొస్తులులు, ఆదిమ సంఘస్థులు ప్రభురాత్రి భోజనము మొదటిగా తీసుకున్న దినము  "ఆదివారము". – (అపొ.కార్య. 20:7).


గమనిక : ప్రియులారా క్రింద వ్రాయబడిన వచనమును బట్టి కొందరు క్రైస్తవులు అనుదినము రొట్టె విరవాలని తప్పుగా అర్థము చేసుకుంటున్నారు కాని ఇక్కడ వారు చేసిన భోజనము అత్మానుసారమైనది కాదు శరీరమునకు కావలసిన ఆహారమని గ్రహించాలి.   

 » ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్థితించుచు. – (అపొ.కార్య. 2:46).



ప్రభురాత్రి భోజనము ఎవరు తీసుకోవాలి..? 

సహోదరులారా ప్రభురాత్రి భోజనమును ఎవరు పడితే వారు తీసుకునే కార్యక్రమమని పరిశుద్ధ గ్రంథము తెలియజేయట్లేదు. ఈ ఆర్హత కేవలము క్రీస్తు శరీరములోనికి అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) బాప్తీస్మము పొందిన వారికే మాత్రమే అనుగ్రహింపబడిందని తెలుసుకోవాలి.

 » ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫెసీ. 1:23).

 » క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? – (రోమా. 6:3).

 » క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. – (గలతీ. 3:27).

» ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. – (1 కొరింధి. 12:13).


ప్రభురాత్రి భోజనముయొక్క ముఖ్య ఉద్దేశ్యము :

అపొస్తులుడైన పౌలు గారు కొరింధి పట్టణములో  ఉన్న క్రీస్తు సంఘమును హెచ్చరిస్తూ, వారి లోపాలను వారికి గుర్తుచేస్తూ ప్రభువైన క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో కలిసి పుచ్చుకున్న భోజన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్క స్థానిక క్రీస్తు సంఘము ఇట్టిరీతిగానే ఆ క్రీస్తు సహవాస భోజనములో పాలు పొందాలని కొన్ని విశేష సంగతులను తెలియజేయడమైనది.


A). "జ్ఞాపకము" : (1 కొరింధి. 11:23-25).

 » నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి. దానిని విరిచి యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

★ జ్ఞాపకము అనగా స్మృతి, జ్ఞప్తి.

1). సమస్త మానవాళి తమ పాపములు విషయములో పరిహారము పొందాలంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే సాధ్యమని మన తండ్రియైన దేవుడు  ముందుగానే ఎరిగి తాను నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయనను నియమించెనని, ఇప్పుడు ఆయన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు మనయెదుట ప్రత్యక్షపరచబడెనని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (అపొ.కార్య. 2:23, 1 పేతురు. 1:18-21).     

2). మన పాపముల నిమిత్తమై మరణించుటకు రక్తమాంసములలో పాలివాడై, ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అపవాదిని నశింపజేసి, మరణభయము నుండి  విడిపించి,  సకల ప్రజల పాపములకు పరిహారము కలుగజేసి, సిలువపై ఎంతో శ్రమ పొంది, తనతో సమాన వారసత్వమును కలుగజేసి, మనలను రక్షించిన  క్రీస్తు మరణ త్యాగమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్ఞాపకము చేసుకోవాలి. – (హెబ్రీ. 2:14-17). 

3). యేసు తాను చేయని తప్పుకి మనకొరకు ఎన్నో శ్రమలనుభవించి, కొరడాలతో కొట్టబడి, ఎన్నో గాయములనొంది, తనను చెంపమీద కొట్టినా, తనను హేళన  చేసినా,  చివరికి తనపై ఉమ్మివేసినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనముగా తండ్రి చిత్తము చొప్పున సిలువ భారమును భరించాడంటే అది కేవలము నీ కోసము నాకోసమే అని గ్రహించి ఆయనను జ్ఞాపకము చేసుకోడానికే ప్రభురాత్రి భోజనమని  తెలుసుకోవాలి. – (యెషయా. 50:6; 53:3-10, మత్తయి. 26:27; 27:26-31, మార్కు. 14:65, యోహాను. 18:22; 19:1, 1 పేతురు. 3:21-24).

4). మనలను ఎలాగైతే అపవాది లోబరుచుకున్నాడో అలాగే, యేసు ఈ లోకములో శరీరధారిగా నివసించినప్పుడు అపవాది చేత ఎన్నో రకాలుగా శోధించిబడినప్పటికీ తాను ఎంతమాత్రము లోబడక అపవాదిని దైర్యముగా ఎదుర్కొని ఈ లోకములో ఉన్నంత కాలము మనకొరకు అపవాదితో మహాయుద్ధము చేసి మనకు జయమును కలుగజేసాడన్న విశేష సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. – (లూకా. 11:21, యోహాను. 1:14; 13:1-17, హెబ్రీ. 2:15).

5). దేవుని స్వరూపము కలిగినవాడైనప్పటికీ, ఆయనతో సమానముగా ఉండే గొప్ప బాగ్యమును విడనాడి, దేవదూతలకంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి, మనుష్య పోలికగా పుట్టి, దాసుని రూపము ధరించుకుని, తనను తాను ఎంతమాత్రము హెచ్చించుకొనక శిష్యుల పాదములను సైతము కడిగి, అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేయుటకు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తనను తాను ఎంతగానో తగ్గించుకుని, మనలను బ్రతికించిన ఆ యేసుని హృదయపూర్వకముగా జ్ఞాపకము చేసుకోవాలి. – (ఫిలిప్పి. 2:5-8, ఎఫెసీ. 2:1, హెబ్రీ. 2:9).

6). మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుటకు అనగా ఇహలోక మాలిన్యమును ఎంతమాత్రమును మనకంటకుండా ఆయనను పోలి నడుచుకోవాలని మనకు మాదిరి చూపించిన ఆ యేసుని జ్ఞాపకము చేసుకోవాలి. – (1 పేతురు. 2:21-24, యాకోబు. 1:27).

NOTE: ఇటువంటి ఎన్నో విశేష సంగతులన్నిటిని జ్ఞాపకము చేసుకొని ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందాలి.


B). "యేసు మరణ ప్రచురము" : (1 కొరింధి. 11:26).

» మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

★ ప్రచురము అనగా ప్రకటించుట.

ప్రియులారా,  క్రీస్తులోనికి బాప్తీస్మము పొంది, ఆ ప్రభువు యొక్క బల్లలో పాలుపంచుకునే నీవు మనకు అప్పగింపబడిన సువార్త పనిలో కొనసాగుతున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి.
సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తియై ఉన్నదని, నశించువారు రక్షింపబడుటకు క్రీస్తు సువార్తయే మార్గమని ఈ లోకములో ప్రకటన చేయాలి.

» సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. – (1 కొరింధి. 1:18).

1). సిలువను గూర్చిన వార్త ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించారని, సమాధి చేయబడెనని, మూడవ దినమున లేపబడెనని అపోస్తులులు ఎలాగైతే ప్రకటన చేసారో మనము కూడా ఈ లోకములో ప్రకటన చేయాలి.

» సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:1-4).

2). క్రీస్తు ఈ లోకమునకు రాకమునుపు మరణము ప్రతి మనుష్యుని యేలెను కాని ఆ క్రీస్తు రాక ద్వారా మరణము ఓడించి, అపవాదికి అపజయమునిచ్చియున్నాడని, పాతాళపు నోరు కట్టియున్నాడని, సువార్త ద్వారా ఆయనను అంగీకరించువారికి జీవమును, అక్షయతను కలుగుజేయువాడు ఆయన మాత్రమే అని ప్రకటన చేయాలి. 

» క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను. – (2 తిమోతి. 1:10).

 జీవము అనగా క్రీస్తునందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకునని,

 అక్షయత అనగా బ్రదికి క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడని ప్రకటన చేయాలి.

» అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. – (యోహాను. 11:25,26).

3). మృతులు అనగా యేసుక్రీస్తు సువార్తకు లోబడనివారు. ఆయన సువార్తకు లోబడనివారికి నీవు తెలియజేయవలసినది ఏమనగా “పాపముల విషయములో చనిపోయిన నీవు క్రీస్తు సువార్త ద్వారానే బ్రతుకుతావని అలా చెప్పుటకు సాక్షిని నేనే అని చెప్తూ, ఆ మృతుడు క్రీస్తు రాజ్యములో (CHURCH OF CHRIST) ప్రవేశించు వరకూ  ఆయన మరణమును గూర్చి ప్రకటన చేయాలి.”

» మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. – (యోహాను. 5:25).


C). "స్వపరీక్ష" : (1 కొరింధి. 11:27-28).

» కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

★ స్వపరీక్ష అనగా తనకు తాను పరీక్షించుకొనుట


మనస్సు మార్పునొంది, దుష్టత్వాన్ని మానుకొని చెడు కార్యములను విడిచి పెట్టుటకు, తన మనసాక్షి నిమిత్తము  తప్పులను సరిచేసుకుని, క్రీస్తులాంటి జీవితమును జీవించాలని ఆలోచన కలిగి హృదయపూర్వకముగా కోరుకునేవారికి ప్రభురాత్రి భోజనము ఒక గొప్ప అవకాశము.

ప్రియ సహోదరుడా,  క్రీస్తువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తనని సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచన ముందుగానే ఎరిగి, మనస్సు మార్చుకునే అవకాశమును ఇవ్వడము జరిగింది కాని యూదా మాత్రము అయోగ్యముగానే క్రీస్తు బల్లలో పాలు పొందాడు, చివరికి క్షమాపణ లేకుండానే మరణించాడు. ఆనాడు యూదాకి ఎలాగైతే అవకాశామునిచ్చాడో  ఈనాడు మనకు కూడా ప్రభురాత్రి భోజనము ద్వారా అవకాశమును కల్పించాడు. అయినప్పటికీ దానిని నీవు ఎంతమాత్రము లెక్క చేయకుండా అయోగ్యముగానే అందులో పాలు పొందితే  ఇస్కరియోతు యూదాలాంటి స్థితిని కొరి కొనితెచ్చుకుంటున్నావేమో అని నిన్ను నీవు పరీక్షించుకుని ఆ బల్లలో పాలుపొందాలని కొరింధి పత్రికలో వ్రాయబడిన మాటల సారాంశమని గ్రహించాలి.


» సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయన నడుగగా ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవు చున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. – (మత్తయి. 26:20-25).


D). "వివేచన" : (1 కొరింధి. 11:29).

» ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

★ వివేచన అనగా ఆలోచించుట లేక గ్రహించుట.

◆ సహోదరులారా, ప్రభురాత్రి భోజనములో భాగంగా రొట్టెను తీసుకునేటప్పుడు అది క్రీస్తు శరీరముకు సాదృశ్యమని, ద్రాక్షారసమును తీసుకునేటప్పుడు అది క్రీస్తు రక్తమునకు సాదృశ్యమనే భావన కలిగియున్నారు కాని వాస్తవానికి రొట్టె క్రీస్తు శరీరముకు, ద్రాక్షారసము ఆయన రక్తముకు చిహ్నమని గ్రహించలేకపోతున్నారు.

◆ నేటి సంఘాలలో చాలామంది ప్రభురాత్రి భోజనము కార్యక్రమము చేస్తున్నపుడు రొట్టెను, ద్రాక్షారసమును పంచిపెడుతూ అవి క్రీస్తు శరీరముకు మరియు రక్తముకు సాదృశ్యముగా చెప్తుంటారు కాని సహోదరుడా ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో సాదృశ్యమనే పదము వాడుట సరియైనది కాదు ఎందుకనగా సాదృశ్యము (figure ) అనగా ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము అని అర్థము వసున్నది. దీనినిబట్టి ఆలోచన చేయగలిగితే రొట్టె క్రీస్తు శరీర ఆకారము కాదు మరియు ద్రాక్షారసము ఆయన రక్తము కాదు కనుక సాదృశ్యమనే భావనతో ఆయన బల్లలో చేయి పెట్టకూడదు.

◆ ప్రభురాత్రి భోజనములో పాలు పొందే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, రొట్టె అనగా సిలువలో నలుగగొట్టబడిన క్రీస్తు శరీరముకు చిహ్నమని, ద్రాక్షారసమనగా ఆయన ఎన్నో గాయములనొంది సిలువలో కార్చిన రక్తముకు చిహ్నమని ఆలోచన కలిగియుండాలి, వివేచనతో ఆ పాత్రలో చేయి పెట్టాలి.  (చిహ్నము అనగా గుర్తు).

◆ క్రీస్తు శరీరము అనగా సంఘము కాని రొట్టె కాదు. అపోస్తలుడైన పౌలుగారు శరీరమంటే సంఘమనే ఉద్దేశముతోనే మాట్లాడటం జరిగిందని గ్రహించాలి. ఎందుకనగా కొరింధిలో ఉన్న క్రీస్తు సంఘములో వివిధ భావాలు ఏర్పడి కక్ష్యలు, పేద, ధనిక అనే  భేధాలు కలిగియున్నారు కనుక వారిని హెచ్చరిస్తూ ఈలాగు చెప్పెను..

◆ మనమంతా క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) అవయవములుగా చేర్చబడ్డామని, ఆయన శరీరమములో అవయవములన్ని ఏలాగైతే ఒక్కటిగా కలిసియున్నాయో  అలాగే క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము ఏక మనస్సును, ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యమును కలిగియుండాలని, ఒకరితో ఒకరు సమాధానము కలిగి దేవునితో సమాధానపరచవలెనని అందుకే క్రీస్తు ఈ లోకములో మరణించాడని వారికి గుర్తుచేస్తూ  ప్రభురాత్రి భోజనము యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయడమైనది. 

 » ఆ సంఘము ఆయన శరీరము. – (ఎఫేసీ. 1:23).

 » కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. – (మత్తయి. 5:22-24).

 » ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. – (ఎఫెసీ. 2:14-17).

 » ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవ ములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. – (1 కొరింధి. 12:12).

కాబట్టి, ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో చేయి పెడుతున్న నీవు నీ సహోదరునితో సమాధానము కలిగియున్నావా?, అన్ని విషయములలో, అన్ని సమయాలలో  క్రీస్తు సంఘముతో ఏకీభవిస్తున్నావా? అని వివేచన కలిగి  ఆ పాత్రలో చేయి పెట్టాలనేది ఆ వచనముల ఉద్దేశమైయున్నది కాని బాప్తీస్మము తీసుకున్నాను కదా అందులో పాలు పంచుకోవాలి కదా అని వివేచన లేకుండా నిన్ను నీవు పరీక్షించుకొనకుండా ఒక ఆచారముగా తీసుకోవాలని సిద్ధపడితే అది శిక్షావిదికే కారకమగును కనుక ఆలోచన చేసి జాగ్రత్తగా ఆయన ఆజన ప్రకారము ప్రభువు బల్ల కార్యక్రమమును నెరవేర్చాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.



మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"దేవుని వాక్యము " (The Word Of God)

దేవుని వాక్యము 


ప్రియ సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.


నేటి క్రైస్తవ్యములో అనేకమంది సహోదరులు దేవుని వాక్యమును సరిగా పరిశీలన చేయక లేఖనములను వారికి అనుగుణముగా మార్చుకుంటూ పరిశుద్ధమైన దేవుని మాటలను ఇహలోక సంబంధమైన కోరికలను తీర్చుకొనుటకు ఉపయోగిస్తూ మనుష్యుల వలన వచ్చు మెప్పుని పొందుటకు ఎంతగానో తాపత్రయపడుతూ దేవుని వాక్యమును లోతుగా సరియైన విధానములో అర్థము చేసుకొనక పై పై మాటలు బోధిస్తూ దేవునికి విరోధముగా నడుచుకొనుచున్నారు. అయితే ప్రియులారా మనము నిజముగా దేవుని వాక్యమును ప్రేమించి అనుదినము లేఖనములను గ్రహించగలిగితే మొదట మన లోపములను మనము సరిచేసుకొని, ఎదుటివారికి బోధించగలము. ఈనాడు అనేకమంది క్రైస్తవ సోదరులు వారి లోపాలను సరి చేసుకోని వారిగా ఉన్నారంటే గ్రంధమును పూర్తిస్థాయిలో గ్రహించలేదనే చెప్పాలి.


నీవు నిజముగా దేవుని వాక్యమును ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమించగలవు (1 యోహాను. 2:5), నెమ్మది (కీర్తన. 119:165), సమాధానము కలిగియుంటావు (కొలస్సి. 3:15), ప్రేమ పూర్వకమైన హెచ్చరికలు చేయగలవు (యెహెజ్కేలు. 3:18-20, ఎఫెసీ. 4:15), సత్యమును ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలవు (ఎఫెసీ. 4:21). పరిశుద్ధ గ్రంథము కూడా ఈ విధముగా సమాధానమిస్తుంది....



A). "దేవుని వాక్యము మన హృదయములోని ప్రతి తలంపును శోధించును".

 » ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. – (హెబ్రీ. 4:12).


B). "దేవుని వాక్యము  మనకు ఆదరణిచ్చును".

 » ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. – (రోమా. 15:4).


C). "దేవుని వాక్యము క్రీస్తులో సహవాసము కలుగజేయును".

 » అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. – (లూకా. 8:21).


D). "దేవుని వాక్యము వివేకము కలుగజేయును".

 » యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. – (కీర్తన. 111:10).


E). "దేవుని వాక్యము మనలను ధన్యులుగా చేయును".

 » దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. – (లూకా. 11:28).


F). "దేవుని వాక్యము మనలను జ్ఞానవంతులుగా చేయును".

 » కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. – (మత్తయి. 7:24).


G). "దేవుని వాక్యము పాపము నుండి మనలను రక్షించును".

 » నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. – (కీర్తన. 119:11).


H). "దేవుని వాక్యము శాంతిని  కలుగజేయును".

 » నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును. – (సామెతలు. 3:1-2).


I). "దేవుని వాక్యము మనము రక్షణలో ఎదుగుటకు సహాయపడును".

 » సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – (1 పేతురు. 2:2-3).


J). "దేవుని వాక్యము సమస్త కల్మషము నుండి విడుదల కలుగజేయును".

 » సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. – (యాకోబు. 1:21).


K). "దేవుని వాక్యము తెలివికి మూలము".

 » నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును. – (కీర్తన. 119:130).


L). "దేవుని వాక్యము వెలుగై యున్నది".

 » నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. – (కీర్తన. 119:105).


M). "దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేయును".

 » ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. – (1 దేస్సాలోనిక. 2:13).


N). "దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలిగించును".

 » నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. – (కీర్తన. 119:50).


O). "దేవుని వాక్యము దుష్టిని మార్గములనుండి తప్పించును".

 » నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. – (కీర్తన. 119:101).


P). "దేవుని వాక్యము ప్రతి శోధన నుండి నిన్ను తప్పించును".

 » నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. – (ప్రకటన. 3:10).


ఏదో అందరు చెప్తున్నారు కదా అని నీ లోపములు సరిచేసుకొనకుండా వాక్యమును బోధించడానికి కాని, గ్రంథము చేత పట్టుకొనడానికి కాని సాహసించినట్లయితే, అటువంటి  వారికి దేవుడిచ్చు హెచ్చరిక ఏమనగా,...

 ★ భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?   దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. – (కీర్తన. 50:16-17).

 ★ ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?. – (రోమా. 2:21).


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"క్రిస్టమస్" (Christmas)

క్రిస్టమస్

ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, నేటి క్రైస్తవ్యములో అనేక శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారాలలో క్రిస్టమస్ ఒకటి. పలురకాల క్రైస్తవ విశ్వాసులు క్రిస్టమస్ ని క్రీస్తు జన్మదినమని, మరి కొంతమంది క్రీస్తుని ఆరాధాన చేయు దినముగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్టమస్ వాతావరణం నవంబర్ నెల ప్రారంభము నుండి జనవరి నెల వరకు మనము చూస్తున్నాము. 

నేటి 20వ శతాబ్దపు క్రైస్తవుడా, ఏటేటా ఈ కార్యక్రమమును ఒక ఆచారముగా జరిగిస్తున్న నీవు ఈ పండుగను గూర్చిన వాస్తవమేమిటో ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అసలు ఈ క్రిస్టమస్ పండుగ మొదట ఎవరు ఆచరించారు? ఈ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? అనే కొన్ని విషయాలను మనము లోతుగా ఆలోచన చేయగలిగితే...

క్రిస్టమస్ యొక్క చరిత్ర


● ఈ పండుగను గూర్చిన ఆధారములను దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధములో చూడలేము కనుక చరిత్ర పుస్తకాలలో చూసినట్లయితే, యేసు మరణించి, మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచిన 300 సంవత్సరాల తరువాత ఆయన యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకుంటూ సంవత్సరములో ఒక దినమును ప్రత్యేకముగా కేటాయించడం జరిగింది.  

● ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను కొంతమంది క్రైస్తవులు Merry Christmas,  X-MAS , Noël , Nativity, Xmas, Yule అని పిలుస్తుంటారు.

● యేసుక్రీస్తు మరణించిన తరువాత 354వ సంవత్సరములో మొట్ట మొదటగా రోమ్ నగరంలో క్రిస్టమస్ ను జరుపుకున్నారు. ఆ తరువాత 379వ సంవత్సరములో కాన్స్టాంటినోపుల్, 388వ సంవత్సరములో ఆంటియోచ్లో అనే నగరాలలో జరుపుకోవడం జరిగింది.

● ఆ రోజుల్లో  ఐరోపా ఖండములో కొన్ని దేశాలవారు  పలు రకాల అన్య పండుగలను ఆచరించేవారు. జర్మన్లు యూలే పండుగను, యూదులు దీపాల పండుగను, మరి కొంతమంది సూర్య భగవానుడి పండుగను, ఇంకా అనేక అన్య పండుగలను ఏటేటా చేసేవారు. ఈ పండుగలన్నీ శీతాకాలములోనే జరుపుకోవడం వారియొక్క శైలి. ఆ సమయములో అనగా ఆరవ శతాబ్దములో డియోనస్ ఎక్సిగ్యుస్ అనే సన్యాసి ఈ పండుగలను గమనించి అన్య పండుగలను జరుపుకునేకంటే మా ప్రభువుకు ఒక దినమును ప్రతేకముగా కేటాయించాలని భావించి, వారి సంప్రదాయాలకు అనుగుణముగా డిసెంబర్ నెలలో క్రీస్తు యొక్క జన్మదినమును జరుపుకోవాలని అక్కడి ప్రజలకు ప్రకటించడం జరిగింది.

● మొదట్లో రోమన్లు క్రిస్టమస్ పండుగను డెసెంబర్ 21వ తేదీన జరుపుకునేవారు. కాని ఆరేలియన్ అనే రోమా చక్రవర్తి ఈ పండుగను డిసెంబర్ 25వ తేదీకి మార్చడం జరిగింది ఎందుకనగా అప్పటికే రోమన్లు డిసెంబర్ 25వ తేదీన సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు కాబట్టి ఆయొక్క ప్రతేక దినమునే ప్రభువైన క్రీస్తు జన్మ దినముగా జరుపుకోవాలని ఉద్దేశించి  డిసెంబర్ 25వ తేదీనే క్రిస్టమస్ గా ఖరారు చేసారు.

● క్రీస్తు వారు చలి కాలములోనే పుట్టారని అప్పటికే ఒక నానుడి ఉంది కనుక యూరప్ దేశాలతో పాటు మిగతా దేశాల వారు కూడా ఈ పండుగను డిసెంబర్ నెలలోనే  ఆచరించడం ప్రారంభించారు.

యేసు డిసెంబర్ 25న జన్మించాడా?

ఈ ప్రశ్నకు సమాధానము ఖచ్చితముగా యేసు డిసెంబర్ 25న జన్మించలేదని చెప్పుటకు చాలా బలమైన ఆధారములు కలవు.

● పైన వ్రాయబడిన విషయములనుబట్టి చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మదినము మనుష్యుల చేత నియమింపబడిందని తెలుస్తుంది ఏలయనగా దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధములోని లేఖనములను ఎంత లోతుగా పరిశీలించినా క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడనడానికి ఎటువంటి ఒక్క ఆధారము మనకు కనిపించదు. 

● లూకా సువార్త 2వ అధ్యాయము 7, 8 వచనములలో రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారికి ప్రతక్ష్యమాయెను అని వ్రాయబడింది కాని డిసెంబర్ నెలలో అని వ్రాయబడలేదు.

» తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. – (లూకా. 2:7-8).

● మరొక ఆధారము ఏంటంటే యేసు తల్లితండ్రులు రోమా జనాభా గణనలో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి బెత్లెహేముకు వచ్చినట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో మనకు కనబడుచున్నది అయితే ఈ విధమైన జనాభా లెక్కలు శీతాకాలములో  నెలలో వ్రాసారనుటకు ఎటువంటి ఆధారము లేదు ఎందుకనగా జనసంఖ్య వ్రాయించుకొనుటకు ఎవరి సొంత ప్రదేశాలకు వారు వెళ్ళుటకు చేసిన ప్రయాణములో వర్షాలు పడుటచేత రోడ్లు బాగాలేక చాల కష్టాలు అనుభవించారని చరిత్ర చెప్తుంది కాబట్టి శీతాకాలములో యేసుక్రీస్తు పుట్టాడని మనము నిర్దారణ చేయలేము.

» ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భ వతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. – (లూకా. 2:1-4).

● యూదుల క్యాలండర్ ప్రకారము వర్షాకాలము తొమ్మిదవ నెల (chisleu) లో వచ్చును వారి క్యాలండర్ ను ఇంగ్లీష్ క్యాలండర్ తో పోల్చి చూస్తే తొమ్మిదవ నెల నవంబర్ డిసెంబర్ మధ్య కాలమును సూచిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినము కాదనే చెప్పాలి.

» యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడు దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.  – (ఎజ్రా. 10:9).

» చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. – (పరమగీతము. 2:11-12).

క్రైస్తవుడు క్రిస్టమస్ పండుగను ఆచరించవచ్చా?

● క్రిస్టమస్ పండుగను ఆచరించవచ్చునో లేదో తెలుసుకునే ముందు అసలు పండుగ అంటే ఏంటో తెలియాలి.

» మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. – (నిర్గ.కాం. 32:6).

» జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. – (1 కొరింధి. 10:7).

● ధర్మశాస్త్ర కాలములో పండుగ అంటే తినడం, త్రాగడం, ఆడటమని తెలుస్తున్నది మరి ఇటువంటి స్థితిని నేటి కాలపు క్రైస్తవుల నుండి దేవుడు కోరుకుంటున్నాడా? ఆలోచన చేయాలి.

● నిజముగా మన తండ్రియైన దేవుడు మనము పండుగలను ఆచరించాలని ఇష్టము కలిగియుంటే యేసుక్రీస్తు యొక్క జనన దినము గూర్చి గ్రంధములో తెలియజేసి, ఆ దినమున యేసుక్రీస్తు పుట్టకను జ్ఞాపకము చేసుకొనమని మనకు ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చును. క్రిస్టమస్ పండుగను గూర్చి ఎటువంటి ఆధారము కాని, ఆ పండుగను గూర్చిన సంభాషణ కాని  గ్రంథములో లేదంటే మనకి ఆ పండుగతో ఎలాంటి సంబంధము లేదనే అర్థమగుచున్నది.

● మరి ముఖ్యముగా దినములు, మాసములు, ఉత్సవకాలములు ఆచరించవద్దని, పండుగలను ఆచరించి ఎదుటివారికి తీర్పు తీర్చే అవకాశము ఇవ్వవద్దని నేటి క్రైస్తవులమైన మనకు ఆజ్ఞనివ్వడం జరిగింది.

» మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు.   మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – (గలతీ. 4:10-11).

» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. – (కొలస్సి. 2:16-17).

● క్రిస్టమస్ పండుగ రోజున మాత్రమే దేవుని మందిరానికి వెళ్లే నామకార్ధపు క్రైస్తవులు నేటి కాలములో అనేకమంది కలరు. చాలా మంది డ్యాన్స్ పోటీలు, నాటకాలు, ఇంకా ఇలాంటి ఇహలోక సంబంధమైన కార్యక్రమములు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. స్త్రీలయితే గ్రంధానికి వ్యతిరేకముగా నడుచుకుంటూ స్టేజీల మీద అన్యులవలె ప్రవర్తిస్తున్నారు.

● ఇంక క్రిస్టమస్ చెట్టు విషయానికొస్తే, దేవుడు ఈ సృష్టిలో సమస్తమును సృజించినప్పుడు అన్నిటికి వాటి వాటి పేర్లు పెట్టాడు కాని ఏ చెట్టుకు కూడా ఇది క్రిస్టమస్ చెట్టు అని చెప్పలేదు. అసలు క్రిస్టమస్ పండుగను గూర్చే ఆధారము లేనప్పుడు క్రిస్టమస్ చెట్టు గూర్చి, నక్షత్రమును గూర్చి, బహుమతులను గూర్చి, క్రిస్టమస్ తాత గూర్చి మాట్లాడుకొనుటలో అతిశయోక్తి లేదు.

» మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు . – (మత్తయి. 15:9). 

» జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని. – (యిర్మియా. 10:3).

వాస్తవానికి క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి? ఒక్కరోజు ముచ్చటగా దేవుని మందిరానికి వెళ్ళేది క్రైస్తవ జీవితము కాదు ప్రతి ఆదివారమున తండ్రిని ఆరాధించి (యోహాను. 4:24) ఆయన కుమారుడైన క్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకోవడమే (1 కొరింధి. 11:23-29) నిజమైన క్రైస్తవ జీవితము.

వాస్తవానికి క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ లోకము ఎదుట దేవుని గుణ లక్షణములను కనపరిచేవారముగా ఉండాలి. అణుకువ కలిగి నీతిమంతులుగా, పరిశుద్దత కలిగి జీవించడమే నిజమైన భక్తి.

★ ప్రియమైన సహోదరీ, సహోదరుడా యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనుష్యరీతిగా జీవించిన 33 సంవత్సరాలలో ఎప్పుడు తన పుట్టిన రోజున జరుపుకున్నట్టుగా గ్రంధములో లేదు మరి నీవు నేను ఎందుకు జరుపుకోవాలి? క్రీస్తు పుట్టిన రోజు జరుపుకోవడములో తండ్రికి ఆనందము కలిగి యుంటే అపోస్తులులు అలాగే ఆదిమ క్రైస్తవులు చేసేవారు కాని వారు చేసినట్టుగా ఎటువంటి దాఖలు లేవు. 

పరిశుద్ధ గ్రంధములో అన్యులైన ఇద్దరు వ్యక్తులు మాత్రమే పుట్టినరోజును జరుపుకున్నట్టుగా మనము చూడగలము.  

★ ఆ దినము ఫరో జన్మదినము. – (ఆ.కాం. 40:20).

★ హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు,.. – (మత్తయి. 14:6).

క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాదించడమా?

● Christmas అనే పేరు లాటిన్ పదమైన Cristes Maesse ను బట్టి  తర్జుమా చేయబడింది.  

● Christmas అనే పదములో   “christ” అంటే క్రీస్తని “mass” అంటే ఆరాధన అని భావించి క్రిస్టమస్ పండుగ రోజున క్రీస్తుని ఆరాధన చేస్తున్నారు. ఈ యొక్క క్రీస్తు నీకే ఆరాధన అనే కొత్త విధానాన్ని క్యాథలిక్ మతశాఖ వారు ప్రవేశపెట్టడం జరిగింది.

వాస్తవానికి క్రైస్తవులు ఎవరిని ఆరాధన చేయాలి? యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 25 వచనాలలో యేసు మాట్లాడిన మాటలు మనము చూడగలిగితే, 

★ ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను ఎవరిని ఆరాధన చేసేవారు..?  "తండ్రిని"
★ యధార్ధముగా ఎవరును ఆరాధించాలి..? "తండ్రిని"
★ యధార్ధముగా ఆరాధన చేయువారు కావాలి అని ఎవరు వెదుకుచున్నారు..? "తండ్రిని"
★ ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి..? "తండ్రిని".

క్రైస్తవుడు ఏ పండుగను చేయాలి?

నా ప్రియులారా ఆచరించాల్సినవి క్రమము తప్పకుండా ఆచరించుటలో నేటి క్రైస్తవులు వెనకబడియున్నారు. అయితే నేటి క్రైస్తవులు ఆచరించవలసిన దినము ఏమిటి? క్రమం తప్పకుండా మనము ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? అని గ్రంధానుసారముగా ఆలోచన చేయగలిగితే సత్యమును అంగీకరించగలము,

» యేసు పునరుత్థాన దినము అనగా ఆదివారము నాడు క్రైస్తవులు ఆ పండుగను లేదా ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి. -  (మత్తయి 28:1; మార్క్ 16:2; లుకా 24:1; యోహాను 20:1).

» నా (యేసు) శరీరము నన్ను (యేసును) జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
» నా (యేసు) రక్తము వలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను (యేసును) జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. - (1 కోరింది 11:24-25).

» ఆదివారమును సంఘము స్థాపింపబడింది కనుక  ఆ దినమును ప్రత్యేక దినముగా ఆచరించాలి. - (అపో.కార్య. 2:41-42; 20:7).

● ఆదిమ సంఘము వారు ఆదివారము నాడే రొట్టె విరుచుట లేదా పులియని రొట్టెతో పండుగ లేదా ప్రభువు బల్ల కార్యక్రముము యెడతెగక చేశారు కనుక మనము కూడా ఈ విషయములో దేవుని ఆజ్ఞను తప్పక పాటించేవారముగా ఉండాలి.
ఆదిమ క్రైస్తవులు సవoత్సరము ఒక్కసారి అని, క్రిస్టమస్ పేరుతో, మరో విషయములో వారు అయోగ్యముగా ఏ పండుగను జరుపలేదు.

» మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.  గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. – (1 కొరింధి. 5:7-8).

నా ప్రియులారా, మరో విశేషమైన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు  మానవకోటికి అవసరమైన ప్రతి ఆజ్ఞను, మేలు కలుగు మార్గములను దేవుని గ్రంథములో తెలియజేయడమైనది. యేసుక్రీస్తు జన్మదినము ఆచరించడము కూడా దేవుని ఆజ్ఞ అయితే ఖచ్చితముగా పరిశుద్ద గ్రంధములో మనకు కనబడును కాని గ్రంధములో ఎటువంటి ఆధారములు లేవంటే మనుష్యులు కల్పించిన క్రీస్తు జన్మదినమును ఆచరించకపోవడమే మనకు మంచిది.

★ కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును.  దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. – (అపో.కార్య. 5:38-39).

నా సహోదరీ, సహోదరుడా కాలములు, సమయములు తండ్రి తన స్వాదీనమందుంచుకున్నప్పుడు ఆ దినము క్రీస్తు పుట్టిన రోజని, ఈ దినము క్రీస్తు మరణించిన దినమని నిర్ణయించడానికి నీవు నేను ఏపాటివారము? ఆలోచన చేయు, వాక్య పరిశీలన చేయు, సత్యాన్ని గ్రహించు, సమయముండగానే నీ తోటి సహోదరులకు సత్య బోధని ప్రకటన చేయు.   

★ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. – (అపో.కార్య. 1:7).

"EASTER"
మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.
The churches of Christ greet you - Roma 16:16