"క్రొత్త నిబంధనలో వాయిద్యములు?" (Musical Instruments in the new testament?)

క్రొత్త నిబంధనలో వాయిద్యములు


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవ్యములో అనేకమంది ఆరాధనలో వాయిద్యములు వాయించవచ్చని భావించి, లేని వాటిని సృష్టించి తండ్రియైన దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు.

క్రొత్త నిబంధనలో వాయిద్యములు (Musical Instruments) ఉన్నాయా..?, అపోస్తులులు కాని ఆదిమ క్రైస్తవులు కాని వాయిద్యములతో ఆరాధించారా..?, అసలు వాయిద్యములు అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ఉందా..?, వాక్యమును పరిశీలన చేసి సత్యాన్ని అన్వేషించు ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానము లేదు అని ఖండితంగా చెప్పగలము. ఎందుకనగా, క్రొత్త నిబంధనలో ఏ సంధర్భములోను వాయిద్యములను ఉపయోగించినట్టుగా చూడలేము అసలు వాయిద్యములు అనే పదమే మనకు ఈ నిబంధనలో కనిపించదు.

క్రైస్తవులమైన మనము వాయిద్యములు వాడచ్చా?


మోషే కాలములో దేవుడు తన మందిరపు యాజకత్వపు పనిని గూర్చి మోషే కు తెలియజేస్తూ యాజకత్వపు పనిని ఆహారోను సంతతి వారు అనగా లేవీ గోత్రస్తులు మాత్రమే చేయాలని తెలియజేసారు.

» మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమ. 28:1).

యెహోవా మందిరములోనికి వెళ్ళుటకు లేవీయులకు తప్ప ఇంకెవరికిని అధికారము లేదు కనుక రాజైన దావీదు కూడా దేవుని మందిరములో వాయిద్యములు వాయించే పనిని లేవీయులకు మాత్రమే అప్పగించునట్టు గ్రంథములో చూడగలము.

» దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను. – (2 దినవృత్తా. 29:25).

పాత నిబంధనలో లేవీయులకు మాత్రమే ఇవ్వబడిన ఈ కార్యక్రమమును క్రైస్తవులమైన మనము చేయవచ్చునా అంటే చేయకూడదు ఎందుకనగా మునుపు అన్యులమైన మనము క్రీస్తు యొక్క నిబంధన రక్తము ద్వారా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము కాని లేవీ గోత్రమునకు అనగా ఆహారోను సంతతికి చెందిన వారము కాము కనుక నేటి క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు వాడకూడదు.

మనము లేవీయుల యాజకత్వమును చేయవచ్చా?


పాత నిబంధనలో లేవీయులకు మాత్రమే దేవుడు అప్పగించిన యాజకత్వపు పనిని ఆ సంతతి వారు తప్ప రాజులైనను, ఇతర గోత్రీకులైనను చేసినట్టు దాఖలు లేవు. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను మీరిన వారు శిక్ష  పొందినట్టుగా కూడా చూడగలము.

» వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

లేవీ యాజకత్వము నేటి క్రైస్తవులకు వర్తిస్తుందా?


పాత నిబంధనలో తెలుపబడిన లేవీ యాజకత్వపు ధర్మము క్రొత్త నిబంధనలో ఎక్కడా చూడలేము. క్రైస్తవులమైన మనము రాజులైన యాజక సమూహమని  గ్రంథము తెలియజేస్తుంది, మరి మనము ఏ విధముగా దేవుని ఆరాధించాలి? మన ప్రధాన యాజకుడు ఎవరు? అనే విషయములను ఆలోచన చేస్తే గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.

» ఆకాశమండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. – (హెబ్రీ. 4:14-15).

» అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. – (1 పేతురు. 2:9).

» నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితిమి. – (ప్రకటన. 5:9).

క్రైస్తవులమైన మనకు క్రీస్తు ప్రధానయాజకుడుగా ఉన్నాడని, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపించాడని, ఆయన రక్తము ద్వారా మనలను రాజులైన యాజక సమూహముగా చేసాడని తెలుసుకోవాలి.

» పాత నిబంధనలో ఈ ప్రధానయజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3, 9:25).

» క్రొత్త నిబంధన కాలమునకు వచ్చేసరికి ఆ పనిని మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు  తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28).

పై వచనములను బట్టి క్రైస్తవులమైన మనకు లేవీ యాజకత్వము వర్తించదని ఖండితంగా నమ్మాలి. ఎందుకనగా ఈ లేవీ యాజకత్వము ఆరాధికుడికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. క్రీస్తు అను మన ప్రధానయాజకుడు ఇట్టి యాజకత్వములో చేరక మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగా వచ్చి యాజక ధర్మము సహా మార్చెను.

» ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవరసమేమి? ఇదియు గాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు. – (హెబ్రీ. 7:10-12).

సత్య లేదా యదార్ధ ఆరాధికులు చేయవలసినది


క్రైస్తవులమైన మనము తండ్రియైన దేవుని మాత్రమే ఏ విధముగా ఆరాధించాలో క్రీస్తు వారు ఈ లోకములో ఉన్నపుడే మనకు తెలియజేసారు.

 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

 ★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

 ★ మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో చెప్పబడిన ఏ వచనములలో కూడా తండ్రియైన దేవుని వాయిద్యములతో ఆరాధించినట్టుగా చూడలేము కనుక క్రైస్తవులమైన మనము వాయిద్యములతో ఆరాధించుట వ్యర్థమైన ఆరాధనే (మత్తయి. 15:9) అగును, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము (రోమా. 14:23)  కనుక ఆలోచన చేసి వాక్యమును పరిశీలన చేసి సత్యమును గ్రహించవలెనని మీకు మనవి చేయుచున్నాను.    

 ● కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. – (హెబ్రీ. 13:15). 


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

8 comments

comments
September 7, 2017 at 6:44 PM delete

చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు బ్రదర్ వందనాలు

Reply
avatar
September 8, 2017 at 1:25 PM delete

వందనములు బ్రదర్ గారు

Reply
avatar
October 12, 2017 at 11:46 AM delete

Love you brother super information

Reply
avatar
October 13, 2017 at 5:35 AM delete

వందనములు బ్రదర్..

Reply
avatar
April 2, 2018 at 1:21 AM delete

కొత్త నిబంధన లో ఎక్కడో ఉందండి తాంతివాద్యములతో అన్నట్లు..
వచనం గుర్తు రావట్లేదు

Reply
avatar
April 2, 2018 at 11:32 PM delete

అసలు క్రొత్త నిబంధనల్లో ఆ పదము లేదండి వందనములు

Reply
avatar
D. S. Raju
June 1, 2018 at 7:56 PM delete

ఒక పాట ఎలా తయారు అవుతుంది ?
ఒక పాటకు రాగం కట్టి ఆ పాట ఫలానా రాగం అని ఎలా చెప్తాము ?
ఎలా అంటే -------- సప్తస్వరాలు గురించి తెలుసు కదా!!
అవి : 1. సడ్జమం 2. రిషభం 3. గాంధారం 4. మద్యమం
5. పంచమం 6. దైవతం 7. నిషాదం . ఇవి మీకు instrument మీదనే తెలుస్తాయి . రచయిత రాసిన పాట
Instrument పై రాగం కట్టబడుతుంది. ఆ పాట ఫలానా రాగం అని , ఆ పాటకు ఫలానా తాళం అని తెలుస్తుంది. ఈ విధంగా పాట తయారు అవుతుంది.
ప్రశ్న : పాట తయారు కావడానికి అవసరమైన వాయిద్యం ఆ పాట పాడటానికి ఎందుకు అవసరం లేదు ?

Reply
avatar
June 1, 2018 at 10:49 PM delete

వందనములు బ్రదర్ గారు

మరొక్క సారి వ్రాయబడిన అంశమును పరిశీలన చేయగలరు మరియు దీని తదుపరి అంశమును కూడా చూడగలరు అని ప్రభువు నందు కోరుచున్నా..

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16