"దేవుని కుమారుడు" (Son of God)

అంశము : దేవుని కుమారుడు (son of God).

సహోదరులందరికిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నా ప్రియులారా, క్రైస్తవ్యములో అనేకమంది మనుష్యులలో బోధలు, సిద్ధాంతాలు, ఆలోచనలు చోటు చేసుకోవడము వలన "దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములో సరైన ఏకత్వము లేకపోవడము" వలన సంపూర్ణ పురుషులు కాలేకపోతున్నారు.


క్రైస్తవ్యములో మూడు రకాల కట్టు కథలు


1). తండ్రియైన యెహోవా దేవుడే కుమారుడుగా (యేసుక్రీస్తుగా) ఈ లోకమునకు శరీరధారియై వచ్చారని.
2). జగత్తు పునాది వేయబడక మునుపే యేసు దేవుని కుమారుడుగా పిలువబడ్డారని.
3). అనాదిలో యెహోవా దేవుడు యేసును సృష్టించారని.

ఈ లోకములో దేవుని కుమారుని గూర్చిన  కట్టుకధలు అనేకమైనవి కలవు గాని ప్రస్తుతమున్న ముఖ్యమైన వాటిని పరిగణలోనికి తీసుకొని, వాక్య పరిశీలన చేసి, వాక్య ఆధారములుతో, మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను.


A). "తండ్రి వారు ఈ లోకమునకు కుమారుడుగా వచ్చారా.."?.

(కాదు)

యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను(యేసుక్రీస్తు), వాక్యము దేవుని(యెహోవా) యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

యోహాను 1: 14
వాక్యము(యేసుక్రీస్తు) శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
 తండ్రివలన(యెహోవా) కలిగిన అద్వితీయకుమారుని (యేసుక్రీస్తు) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

గమనిక :- "తండ్రివలన(యెహోవా) కలిగిన అద్వితీయకుమారుని(యేసుక్రీస్తు)".


B). "జగత్తు ముందే యేసు దేవుని కుమారుడా.. "?.

(కాదు).

యోహాను 1: 1
"....వాక్యము దేవుడై యుండెను"

యోహాను 3: 16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన "అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు" విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

గమనిక :- "అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు".


C). "తండ్రి అనాదిలో యేసును నిర్మించారా.."?

(లేదు).


● యేసు అనాది నుండి దేవత్వపు లక్షణములు కలిగి తండ్రితో సమానముగా ఉన్నారు.

ఆదికాండము 1: 26
దేవుడు "మన స్వరూపమందు"
"మన పోలికె చొప్పున" నరులను చేయుదము.
ఫిలిప్పీయులకు 2: 6
ఆయన "దేవుని స్వరూ పము" కలిగినవాడైయుండి, "దేవునితో సమానముగా" ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు.
కొలస్సీయులకు 2: 9
"దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత" శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.

★ ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడినప్పటికి (లూకా. 3:38). "దేవత్వము లక్షణములు కలిగినవాడు కాదు".


"దేవుని కుమారుని గూర్చిన వివరణ"


"దేవుని కుమారుడు" అనగా దేవుని ప్రజలను యుగయుగములు ఏలుబడి చేయువాడని అర్ధము.


■ "కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి..." - (గలతి. 4:4).

■ అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. ( గలతి. 3:16).

■ "అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు..." (మత్తయి. 1:1).

■ పరమ తండ్రి ఏలుబడిని ఇశ్రాయేలు ప్రజలు విసర్జించి, తమకు లోకసంబంధమైన రాజును నియమించమని సమూయేలును కోరగా, సమూయేలు యెహోవా కి ప్రార్థన చేసి, యెహోవా మాట చొప్పున వారికి భౌతికసంబంధమైన మొదటి రాజును నియమించెను. - (1 సమూయేలు. 8:1-22; 9:2,17).

■ లోక సంబంధమైన అనేక మంది రాజులు ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసి, యెహోవా ఆజ్ఞలను ధిక్కరించి, ఆయనకు విరోధముగా పాపము చేసిరి.

గనుక, యెహోవా ఈ లోక సంబంధమైన రాజులు పట్ల విసుగు చెంది "దావీదుతో చేయబడిన వాగ్దానము నేరవేర్చుటకే తన ప్రజలను  ఏలుబడి చేయుటకు, తన యొద్ద ఉన్న వాక్యమును(యేసుక్రీస్తు) దేవుని కుమారునిగా ఈ లోకములో పుట్టించెను." - (2 సమూయేలు. 7:12-16; యిర్మీయా. 23:5; లూకా. 1:32; యోహాను. 3:16).

■ దేవుని రాజ్య భారమును నిత్యము మోయుటకై తండ్రి వారు యేసును దేవుని కుమారునిగా పుట్టించెను. - (యెషయా. 9:6).

గమనిక:- తన కుమారుడు ఏలుబడి చేయుటకు నియమించిన రాజ్యము లోక సబంధమైనది కాదు. (యోహాను. 18:36).

■ తన ప్రజలు వారి పాపములు కొరకు యేసు మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4) తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). మహా దేవుడు కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

■ తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తన కుమారుని ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3; 9).

■ అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి తన ప్రజలను ఏలుబడి చేయుటకు తనను "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. (లూకా.1:32; అపో.కార్య. 2:32-36).

■  అతని సింహాసనము "సూర్యుడున్నంతకాలము" నా సన్నిధిని ఉండుననియు.. "చంద్రుడున్నంతకాలము" అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు. - (కీర్తన. 88:35-36).


"దేవుని కుమారుని రాజ్యములో పాలు పొందుటకు మనము ఏమి చేయవలెను?".

● మనము "సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని" తన కుమారుని విశ్వసించాలి. (మత్తయి. 16:16).
● ఈయన తన ప్రజలను ఏలుబడి చేయుటకు వచ్చిన దేవుని కుమారునిగా గుర్తించాలి. (యోహాను. 1:49).
● బాప్తీస్మము పొంద గోరువారు "యేసు దేవుని కుమారునిగా అనగా నా రాజని, నన్ను శాస్వతమైన సింహాసనము  మీద కూర్చొని నన్ను ఏలుబడి చేయువాడని విశ్వసిస్తే, తన రాజ్యములోనికి చేర్చబడుతాడు. (అపొ.కార్య. 8:36; రోమా. 10:39; అపొ.కార్య. 2:38-40;47).
● దేవుని కుమారునియందలి అనగా అయన ఏలుబడి యందు ఉంటు విశ్వాసము వలన జీవించవలెను. (గలతి. 2:20).
● యేసు దేవుని కుమారుడని ప్రకటించవలెను. (అపో.కార్య. 9:20).
● యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన యెడల జీవము పొందుకోగలము. (యోహాను. 20:31).
● యేసు దేవుని కుమారుడుగా నమ్మే వాడు తన హృదయములో యేసును ప్రతిష్టంచుకొని (1పేతురు. 3:15), తన ఏలుబడిలో ఉంటూ, ఇక మీదట జీవించువాడిని నేను కాదు ఆయనే అనే ఆలోచన గలిగిన వారుకి మాత్రమే యేసు వారు దేవుని కుమారునిగా ఉంటారు.
● మనలో "దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములో ఏకత్వము పొందాలి అనుకుంటే అపొస్తలుల బోధ వలన మాత్రమే సాధ్యము. (యోహాను. 17:20-22)


1యోహాను 2: 22
యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.

"మనోహర్ బాబు గుడివాడ" ©

"వెయ్యి సంవత్సరముల పరిపాలన" (1000 Years Ruling)

అంశము: "వెయ్యి సంవత్సరముల పరిపాలన"

నా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

(ప్రకటన గ్రంథం 20: 4-6)
అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.


నా ప్రియులారా, క్రైస్తవ్యములో "వెయ్యి సంవత్సరముల పరిపాలన" గూర్చి అనేకమైన బోధలు, తలంపులు, కథలు ఉన్నాయి.

* క్రీస్తు రెండో రాకడలో ఆకాశములో ప్రత్యక్షమై సంఘమును తీసుకొని వెళ్తారని,
* అటు తరువాత, క్రీస్తు మధ్య ఆకాశములో సంఘముతో పాటు ఏడు సంవత్సరములు పెండ్లి విందులో ఉంటారని,
* భూమి మీద ఉన్నవారికి(సంఘములో లేని వారు) భయంకరమైన శ్రమలు వస్తాయని,
* పెండ్లి విందు, భూమి మీద శ్రమల కాలమైన తరువాత క్రీస్తు మరల సంఘమును పట్టుకొని భూమి మీదకు వస్తారని,
* అటు తరువాత, యెరూషలేమును కేంద్రముగా పెట్టుకొని, పరలోక  వాతావరణమును ఈ లోకములోనికి దించి క్రీస్తు తన రాజ్యమును "వెయ్యి సంవత్సరముల పరిపాలన" చేస్తారని.

ఇలాంటి కట్టుకధలు అనేకమంది బోధకులలో వింటూ ఉంటాము.


పరిశుద్ధ గ్రంథము వెయ్యి సంవత్సరముల పరిపాలన గూర్చి ఏమి మాట్లాడుతుందో ఆలోచన చేద్దాము

"ప్రకటన 20:4-6 ఏమి బోధించటము లేదు"


1). వెయ్యి సంవత్సరములు క్రీస్తు భూమి మీద ఎలుబడి చేస్తారని చెప్పటం లేదు. ఎలుబడి చేయు చోటు కూడా ప్రస్తావించలేదు.
2). క్రీస్తు పరిపాలన గూర్చి మాట్లాడటము లేదు.
3). యెరూషలేము కేంద్రముగా చేసుకొని క్రీస్తు ఎలుబడి చేస్తారని చెప్పడము లేదు.
4). హత సాక్షులు పరిశుద్ధమైన ఏలుబడి భూసబంధమైనదని చెప్పటము లేదు.
5). క్రీస్తు సింహాసనాన్ని గూర్చి ప్రస్తావించలేదు.


"ప్రకటన 20:4-6 ఏమి బోధిస్తుంది".


1). క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయని వారు.
2). తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారు.
3). దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు.
4). మొదటి పునరుత్థాన ములో పాలుగల వారు.
5). రెండవ మరణమునకు లోనుకాని వారు.
6). దేవునికి + క్రీస్తునకు యాజకులైనవారు.

Note:- "వీరు" క్రీస్తుతో కూడా "వెయ్యి సంవత్సరముల రాజ్యము" చేయుదురు.

* అంతేకాని, క్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము చేస్తాడని ప్రకటన. 20:4-6 చెప్పడము లేదు.


బైబిలులో "వెయ్యి" అనే పదము


◆ "నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను". - (నిర్గమ. 20:6; ద్వితీ. 5:10).
◆ "అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా" - (కీర్తనలు. 50:10).
◆ ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. - (2 పేతురు. 3:8; కీర్తనలు. 40:4).

"వెయ్యి సంవత్సరములు అనేది అక్షరార్ధం కాదు".


"యేసు భూమి మీద ఏలుబడి చేయరు"


● యేసు శరీరధారియై ఈ భూమి మీదకు రాకమునుపే అనగా 600 సంవత్సరములు ముందే ప్రవక్తయైన యిర్మీయా క్రీస్తు రాకడలో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తాడు అని తెలియజేసారు.
● తండ్రియైన దేవుడు "యెకోన్యాను శపించుట" - (యిర్మీయా. 22:21-29).
● యెకోన్యా సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. - (యిర్మీయా. 22:30).
● యెకోన్యా సంతానములో ఎవడును యెరూషలేములో సింహాసనము మీద కూర్చుండుటకు అవకాశము లేదు.
● మన ప్రభువైన యేసు వారు యెకోన్యా సంతతి వారు. - (మత్తయి. 1:11).
● మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములో సింహాసనము మీద కూర్చుంటాడు అనేది అర్ధరహితమైన మాట.
● యెకోన్యా రాజవంశములో ఉన్నవాడు కానీ ఆయన సంతతి వారు ఎవరు కూడా యెరూషలేము మీద రాజుగా ఉండడు.

​దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము. - (యిర్మియా 22: 29)

● క్రీస్తు రాకడలో ఆయన భూమి మీదకు వచ్చి, యెరూషలేమును కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తాడు అనేది ప్రవచనము అసాధ్యము.


 యేసు ఇహసంబంధమైన రాజ్యాన్ని పరిపాలన చేస్తారా..?


A). యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. - ( యోహాను. 18: 36).
B). "రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని" యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. (యోహాను. 6:15).


క్రీస్తు రెండో రాకడలో ఇహలోకమందు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అనేది అర్ధరహితమైన మాట అని గ్రహించాలి.


 క్రీస్తు రెండో రాకడలో కొనిపోబడిన మనము మరల భూమి మీదకి వస్తామా..?

1థెస్సలొనికయులకు 4: 15-17

● మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

● ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

● ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము.
కాగా మనము "సదాకాలము ప్రభువుతో" కూడ ఉందుము.

సదాకాలము అనగా శాశ్వతముగా లేదా ఎల్లప్పుడూ అని అర్ధము.

* సదాకాలము అంటే వెయ్యి సంవత్సరములు అని అర్ధము కాదు.
* ఆకాశమండలమునకు  కొనిపోబడిన మనము మరల భూమి మీదకు రాము.
* రెండో రాకడలో క్రీస్తు వారు భూమి మీదకు వచ్చి రాజ్యము చేసే కార్యక్రమము ఉండదు.


 క్రీస్తు నేడు రాజ్యపరిపాలన చేస్తున్నారా..?


అవును.... యేసు మరణించి, సమాధి చేయబడి, మూడో దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4) తన వారుకి కనబడి నలబై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4).
● అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమాయెను. అనగా దేవుడు సముఖమునకు తేబడెను. ఇదే దానియేలునకు కలిగిన దర్శనము (అపొ.కార్య. 1:8-9; దానియేలు. 7:13-14).

మనుష్యకుమారునిపోలిన - "యేసుక్రీస్తు" మహావృద్ధు డగువాని - "యెహోవా"

● తండ్రియైన దేవుడు తన కుమారుడిని అభిషేకము చేయుట.

♀మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. (అపొ.కార్య. 2:36).

● తండ్రి చేత పట్టాభిషేకం పొందిన పిమ్మటనే క్రీస్తు తన రాజ్యమును అను క్రీస్తు సంఘమును పరిపాలన చేస్తున్నాడు.

● తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. (కీర్తన. 2:6; 110:1-2; అపొ.కార్య. 2:33-35; 1కోరింథీ. 15:25).

● మనము ఎప్పుడైతే యేసును ప్రభువని నోటితో ఒప్పుకొన్నామో, (రోమా. 10:9). బాప్తీస్మము పొందామో (మత్తయి. 28:19; అపొ.కార్య. 2:38) అప్పుడే అయన తన ప్రజల హృదయములో ఏలుబడి చేయుచున్నారు అని గ్రహించాలి.

● నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి క్రీస్తు సంఘమును అనగా తన రాజ్యమును పరిపాలన చేస్తున్నారు.


క్రీస్తు తన రాజ్య పరిపాలను ఎప్పుడు వరకు చేస్తారు..? 


● ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును. - (లూకా. 1:33).

యుగయుగములు ఏలుబడి (లుకా.1:30-33). అనగా సూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము రాజ్యపరిపాలన చేస్తారు.

● అతని సింహాసనము "సూర్యుడున్నంతకాలము" నా సన్నిధిని ఉండుననియు
● "చంద్రుడున్నంతకాలము" అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు. (కీర్తన. 88:35-36).

● "సూర్యుడున్నంతకాలము, చంద్రుడున్నంతకాలము" అనగా  పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవు సమయము వరకు, ఆకాశములు రవులుకొని లయమైపోవు వరకు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు వరకు, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవు వరకు,  క్రీస్తు తన రాజ్యమును పరిపాలన చేస్తారు. (2 పేతురు. 3:10-11).

● ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; "అప్పుడు అంతము వచ్చును". - ( 1కోరింథీ. 15: 24).

హెచ్చరిక


1). మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెండో రాకడ లో యెరూషలేమును కేంద్రముగా చేసుకొని వెయ్యి సంవత్సరముల పరిపాలన చేస్తాడు అనేది ఒక కల మరియు అది అబద్ధము.
2). క్రీస్తు సంఘముగా (church of Christ) ఉన్నవారు మాత్రమే ఆయన ఏలుబడిలో లేదా అధికారములో ఉన్నవారు అనే విశేషమైన సంగతిని తెలుసుకో! (ఎపేసి. 1:23; కొలొస్స. 1:13; 18; రోమా. 16:16).
3). ప్రతీ ఒక్కరి ఆలోచనలు, పనులు, హృదయము ఆయన అధికారము క్రింద ఉండాలి. (మత్తయి. 7:21; 1 కొరింథీ. 10:5; 1 పేతురు. 3:15).
4). క్రీస్తు వెయ్యి సంవత్సరముల రాజ్యము చేస్తాడని (ప్రకటన. 20:4-6) చెప్పడము లేదు.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ (KM).©

"దేవుని ప్రేమ" (God is Love)

అంశము: "దేవుని ప్రేమ"

నా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

1యోహాను 4: 8
దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

● దేవుడు తన స్వభావము బట్టి ప్రేమయైయున్నాడు.
● దేవుడు తన స్వరూపము బట్టి ప్రేమయైయున్నాడు.
● ప్రేమయైయున్న దేవుడు తన వాతావరణమును(పరలోకమును) ప్రేమతో నింపియున్నారు.
● ప్రేమయైయున్న మన తండ్రినైనా దేవుడును ప్రేమలేని వాడు ఎరుగడు.
● తన పిల్లులు ప్రేమ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక.


★ మన దేవుడు కంటికి కనిపిoచేవాడు కాదు. ఆయన అదృశ్యడు. (యోహాను. 1:18; 1 యోహాను. 4:12).
★ ఆ అదృశ్యదేవుని యొక్క స్వరూపి మన ప్రభువైన యేసుక్రీస్తు. (కొలస్సీ. 1:15).


"తన ప్రేమను నరుడు నిర్మాణము ద్వారా ప్రదర్శించుట"


★  "మరణములేని స్థితి"
 దేవుడు "తన స్వరూపమందు" నరులుకు మాత్రమే ఇచ్చుట విషయములోనే దేవుని నరులును ఎంతగా ప్రేమించాడో అనేది అర్ధము అగుచున్నది. (ఆది కాండము. 1:26-27). దేవుని స్వరూపములో చేయబడిన వాడు మరణము లేనివాడు.

★  "పాపము చేయలేని స్థితి"
"నీతి స్వరూపుడు" అనగా "పాపమూ లేని వాడు లేదా చేయనివాడు". (యోహాను. 17:25) ఇటువంటి మన దేవుడు నరులును  పాపిగా సృజించలేదు మరియు పాపము చేయలేని బుద్ధిని మనకు అనుగ్రహించాడు. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించే తత్వముతో దేవుడు నరుని నిర్మాణము చేసాడు.

★  "అబద్ధమాడజాలని స్థితి"
దేవుడు సత్యస్వరూపుడు (ప్రకటన. 6:10).
"సత్యస్వరూపి" అనగా అబద్ధము మాట్లాడలేనివాడు అని అర్ధము.  మన దేవుడు, అబద్ధమాడజాలని వాడు (హెబ్రీ. 8:18).

★  "ద్వేషించలేని స్థితి".
దేవుడు ప్రేమాస్వరూపి (1 యోహాను. 4:8). దేవుడు నిన్ను ప్రేమించి తన రూపములో చేసెను. కావున నీ తోటి సహోదరుడును నీవు ద్వేషించకూడదు. మనకు ప్రేమించే స్థితిని ఇచ్చాడు కానీ ద్వేషించే స్థితిని తన నిర్మాణము ద్వారా ఇవ్వలేదు.


యేసు ద్వారా చూపిన ప్రేమ


● మన పాపములు విషయములో మనము యుగయుగాలు శిక్ష అనుభవించలేమని "ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని ఇచ్చాడు". (1 యోహాను. 4:10).
● "మన అపరాధములను మన మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుటలో మన అపరాధములన్నియును యేసు మీద మోపాడు..." (1 కొరింది. 5:19-21).
● మనము ప్రేమించుట విషయములో చివరికి తన "కుమారుడు చేతిని విడిచి పెట్టుటలో" అయనకు మన యెడల ఉన్న ప్రేమ కనబడుతుంది. (మత్తయి. 27:46).
● మనము నశింపక నిత్య జీవము పొందుటకు యేసు అనుగ్రహించెను. (యోహాను. 3:16).
● పాపమరణములు నియమము నుండి దేవుని ప్రేమ క్రీస్తు బలి ద్వారా విడిపిచింది - (రోమా. 8:1-4).
● క్రొత్త నిబంధన చేయుటలో దేవుని ప్రేమ ఉంది. మనము చేసే ప్రతి పాపము విషయములో యేసు మీద కక్ష తీర్చుకొని మన మీద ఉండే కోపమును చల్లార్చుకొని మనతో సమాధానము పడి, దయగలిగి ఉన్నారు. (కీర్తన. 85:2-3; హెబ్రీ. 8:8-12).
● మనుష్యులు యెడల దేవుని దీర్ఘశాంతము వహించుటలో ప్రేమ ఉంది. (2 పేతురు. 3:15).
● ప్రతి ఒక్కరి జీవితములో మార్పులు లేదా దిద్దుబాటు విషయములోను, యెవడును నశింపకూడదని, దీర్ఘశాంతము వహించుటలో దేవుని ప్రేమ ఉంది. (2 పేతురు. 3:9; రోమా 2:4).
● తన రాజ్యమును నీ కొరకు సిద్ధపరిచాడు. (మత్తయి 25:34) నరకమును నీ కొరకు సిద్ధపరచలేదు.(మత్తయి. 25:41). ఆ విషయములో దేవుని ప్రేమను కనపరుచుకొన్నాడు.


మనము చేయవలసిన పని


1) 1యోహాను 4: 11
ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.

2) 1యోహాను 3: 16
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

3) 1యోహాను 3: 18
చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

4) రోమీయులకు 12: 9
మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.

5) రోమీయులకు 12: 10
సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

6) 1కోరింథీయులకు 14: 1
ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి(మూలభాషలో-ప్రేమను వెంటాడుడి) .

7) గలతియులకు 5: 13
 ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

8) 1పేతురు 4: 8
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

9) 1యోహాను 2: 15
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.

10) యోహాను 15: 13
తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.

హెచ్చరిక 


మొదటి ఆజ్ఞ :-
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. (మత్తయి. 22:37).

రెండవ ఆజ్ఞ :-
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను. (మత్తయి. 22:39).


ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను.
(1 యోహాను. 2:5).

సత్య అన్వేషకులు చేత అపార్ధము చేయబడుతున్న "(John 14:6-11)"Miss understanding by the Truth Seekers

సత్య అన్వేషకులు చేత అపార్ధము చేయబడుతున్న (యోహాను. 14:6-11 వచనములు)

సహోదరీ,సహోదరులందరికీ  మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

యోహాను 14: 6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

సమస్త మానవ జాతి తండ్రి యొద్దకు చేరుటకు యేసు వారు మార్గము, సత్యము, జీవము అని బాగుగా తెలియాలి. యేసు ద్వారానే తప్ప మరి ఏ ఒక్కరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు.

తండ్రి ఎక్కడ ఉన్నారు .? 

● "పరలోకమందున్న మా తండ్రి" - (మత్తయి. 6:9).
● "సర్వాంతర్యామి అనగా అన్ని చోట్ల ఉన్నవారు" - (కీర్తన. 139:7-10).

◆ "నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు". -(ద్వితి.కాం. 10: 17).

యెహోవా ఎవరుకి తండ్రి..? 

● "మీ తండ్రి" - (మత్తయి. 5:48 7:11).
● "నీ తండ్రి" - (మత్తయి. 6:4,6,18).
● "నా తండ్రి" (యేసువారికి కూడా తండ్రి) - (మత్తయి. 7:21; 10:32).
● "మనకు తండ్రి" - (1 కోరింథీ. 8:6)

ఈ వాక్య ఆధారములు చూసాక తండ్రి వారు యేసు రూపములో వచ్చారు అని అపార్ధము చేసుకొనవసరం లేదు.


యోహాను 14: 7-9
మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.

అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా

యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?


ఈ వచనములులో యేసు వారు మూడు సార్లు "ఎరుగుట" గూర్చి మాట్లాడటం జరిగింది.

ఎరుగుట అనగా తెలుసుకొనుట, గ్రహించుకొనుట

యేసును గూర్చి ఏమి తెలుసుకోవాలి..?


● " తన ప్రజలను వారి పాపములనుండి రక్షించుటకు యేసు పుట్టారు" అని- (మత్తయి. 1:21)
● "యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు" అని - (మత్తయి. 16:16).
● "మన యెడల ఉండే తండ్రి యొక్క చిత్తము జరిగిoచుటకును, తండ్రి రొమ్మున నుండి యేసు ఈ లోకమునకు పంపబడినవాడు, మన మధ్యకి వచ్చి తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణముగా నేరవేర్చాడు" అని - (యోహాను. 5:24,36-38, 17:4).
● "లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" అని - (1 కోరింథీ. 15: 3).
"తండ్రి యొద్ద నుండి ఈ లోకమునకు వచ్చి మరల ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లారు" అని - (యోహాను. 1:18; 16:26-27; 6:57; అపొ.కార్య. 2:32-36).

యేసు ఎవరు అనేది నిజముగా ఎరిగి ఉంటే యేసును మన కొరకు పంపిన ఆ ఒక్క తండ్రిని కూడా క్రీస్తు బలి ద్వారానే వారు(తండ్రి + కుమారుడు) ఇరుగురు అని తెలుసుకొనే స్థితి కలుగుతాది.


యోహాను 14: 8-10
అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా

యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?

తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.


ఈ మూడు వచనములలో "పిలిప్పునకు మరియు యేసుకి మధ్య సంభాషణ".

"పిలిప్పు భౌతికముగా ఆలోచన చేసి తండ్రిని చూడాలి అని ఉంది అని యేసును అడిగినట్టుగా చూడగలము. దీన్ని బట్టి పిలిప్పు ఆయనను సరియైన రీతిలో తెలుసుకోలేకపోవడమే".

"నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు" - (యోహాను. 14:9).

ఈ వచనము పట్టుకొని నీవు ఇలా అనుకోవచ్చు తండ్రియే మన మధ్యకి యేసు వలె వచ్చారని ఆలోచన ఉంటే ఈ క్రింది వచనములు విషయములో నీవు సత్యము ముందు మౌనము వహించవలసిన అవసరము కలుగును.

యోహాను 1: 18
"ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు".
యోహాను 6: 47
"దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్నవాడు".
 ◆ 1యోహాను 4: 12
"ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు".


నన్ను చూచినవాడు అనగా యేసు ఎందుకొరకు వచ్చారో, ఏమి ప్రకటన చేసారో, ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచారో అని పరిశీలన చేయువాడే తండ్రి యొక్క మనస్సు, ప్రేమ, మన యెడల చిత్తమును జరిగించు యేసు ద్వారా తండ్రిని చూచువాడు అని అర్ధము."


● యేసు వారు "తండ్రి యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను". - (యోహాను 8:26)

ఈ విషయాలను కొందరు ఎరుగకపోవడము వలననే తండ్రి వారు యేసు అని వాక్యమును అపార్ధము చేసుకొనుచున్నారు.


యోహాను 14: 11
తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.

అవును...

◆ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది -
(కొలొస్స 1:19).
◆ యేసు దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, - (హెబ్రీ 1: 3).

Note:- ఈ వచనములోనే కాదు బైబిల్ అంతటిలో యేసు వారు ఎక్కడ  కూడా "నేను తండ్రిని అని" చెప్పుకోలేదు.

● యేసు మన మధ్యకు రక్షకుడుగా మరియు దేవుని కుమారుడుగా పుట్టి (మత్తయి 1:21; యోహాను. 3:16) దాసుని స్వరూపము ధరించి (ఫిలిప్పీ. 2: 6) సమస్త జనులు పాపములు కొరకు అక్రమకారులు చేత సిలువ వేయబడి, సమాధి చేయబడి, మూడవ దినమున తండ్రిచేత లేపబడెను.  (లూకా. 24:47; అపొ.కార్య 2:23-24,32; 1 కొరింథీ 15:3-4; 1పేతురు. 2:24).

●అటు పిమ్మట, పరలోకమును ఆరోహణమయ్యి, యేసు వారు తండ్రి కుడిపార్శ్వమున హెచ్చింపబడి "తండ్రి చేత ప్రభువుగాను, క్రీస్తుగాను నియమింపబడ్డారు". (అపొ.కార్య. 1:9; 2:33, 35-36)

కాబట్టి నా ప్రియులరా... ఇకనైనా ఆలస్యము చేయక వాక్య పరిశీలన చేసి, ఈ దినమే వారు (తండ్రి + కుమారుడు) ఇరుగురు అనే గొప్ప సత్యమును అంగీకరించుము.



యోహాను 17: 3
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును 
నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే.
(నిత్య జీవము).

మనోహర్ బాబు గుడివాడ ©

"యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయుల ప్రజలు" (Joshua The Leader to the Israelites)

అంశము:- "యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయుల ప్రజలు"

నా తోటి పరిశుద్ధులకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నాయకత్వము అనగా "నాయకునిలోఉండు గుణము" లేదా "నేతృత్వము".

◆ మోషే తరువాత ఇశ్రాయేలీయులు ప్రజలకి నాయకత్వము వహించుటకు యెహోషువ తండ్రినైనా యెహోవా చేత ఎన్నుకోబడ్డాడు. (యెహోషువ. 1:1-2).

◆ తన నాయకుడునైనా మోషేతో నిజము పలికిన మంచి పరిచారకుడు. (సంఖ్యా. కాండ. 14:36-38).

◆ కనాను దేశమును స్వాధీనపరుచుకొనుటలో మంచి నాయకుడై  ఇశ్రాయేలీయులు ప్రజలను నడిపించాడు. - (సంఖ్యా. 27:15-23).

◆ యెహోషువ నాయకుడై అమలేకీయుల పై యుద్ధము చేసి ఇశ్రాయేలీయులను గెలిపించాడు. (నిర్గమ. 17:9-11).

◆ దేవుని పని విషయము లో ఎల్లపుడు మోషేకు పరిచారుకుడై యుండెను. (నిర్గమ. 24:12-13).

◆ కనాను దేశము గూర్చిన మంచి సమాచారము మోషేకు తెలియజేసిన వారిలో యెహోషువ ఒక్కడైయుండెను. - (సంఖ్యా. 14:6-30).

◆ యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు కాననీయులతో యుద్ధము చేసి గెలిచెను. ( యెహోషువ 1-12 అధ్యాయములు వరకు).

◆ యెహోషువ నాయకుడై, ఇశ్రాయేలీయులు ప్రజలకు వారి వారి గోత్రములు చొప్పున యెహోవా వారుకి ఇచ్చిన స్వాస్థ్యమును పంచిపెట్టెను. - (యెహోషువ 13 - 23 అధ్యాయములు వరకు).

◆ యెహోషువ ఇశ్రాయేలీయులును పిలిపించి యెహోవా ఆజ్ఞలును తెలియపరిచి వాటిని నిత్యము గైకొనమని హెచ్చరించెను. (యెహోషువ. 22 అధ్యాయము).

◆ యెహోషువ బహు సంవ త్సరములు గడచిన ముసలివాడై, తన చివరి దినములో కూడా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలును మరియు కట్టడలను ఇశ్రాయేలీయులు ప్రజలకి తెలియజేసి, తన మరణము వరకు కూడా దేవుని ప్రజలకి మంచి నాయకుడైయుండెను. (యెహోషువ 23 - 24 అధ్యాయములు).

★ యెహోవాను సేవించెటలో యెహోషువ తన యింట వారి యెడల మంచి నాయకత్వపు పాత్ర పోషించెను. (యెహోషువ. 24:15).


ఈయన గూర్చిన చెప్పబడిన మాటలు బట్టి యెహోషువ దేవుని యెదుట భయభక్తులు గలవాడై, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా యెదుట నిష్కపటముగాను సత్యము గాను నడుచుకొనియున్నాడని తెలియబడుచున్నది. (యెహోషువ. 22:5; 24:14-15).

నా ప్రియులారా, మనము కూడా యెహోషువ లాంటి మంచి నాయకుడు వలె దేవుని ప్రజలను నడిపించుటలో ముందడుగు వేయాలని ఆశిస్తూ క్రీస్తు నందు కోరుతున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ (KM).

"దేవుని క్రమములో పురుషుని పాత్ర". (Role of Men)


అంశము: "దేవుని క్రమములో పురుషుని పాత్ర". 

నా తోటి సహోదరీ, సహోదరులారా!!

మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు  నామములో నా వందనములు.



(ఆదికాండము. 2: 7)
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

నరుడు - దేవుని పోలిక దేవుని స్వరూపం - ఆత్మ

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; (ఆదికాండము. 1:27).

ఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(ఆదికాండము. 2:18) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.

తండ్రియైన దేవుడు మొదటి మనుష్యుడు(నరుడు) ఒంటరిగా నుండుట మంచిది కాదు అని చూసి అతనికి సాటియైన సహాయము కొరకు దేవుడు ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించారు. (ఆది. 1:27; 2:18; 21-22).

● స్త్రీ ద్వారా శాపము కలుగకమునుపు వారు ఇరువురు దేవునితో మంచి ఆత్మీయ సంబంధములు కలిగి ఉండేవారు.
● దేవుడు వారిని ఆశీర్వదించి, ఫలించమని, అభివృద్ధిపొందమని, విస్తరించమని, భూమిని నిండించి దానిని లోబరచుకొనమని చెప్పెను. (ఆది. కాండ. 1:28).
● దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మరచి స్త్రీకి లోబడుట వలననే ఆదాము ఆమె చేత మోసగింపబడ్డాడు. (ఆది. 2:17; 3:17; 1 తిమోతి. 2:14).


"పురుషుని నాయకత్వములో ఆశీర్వదింపబడిన కుటుంబాలు"


● "నోవహు కుటుంబము" - (ఆది. 7:13; హెబ్రీ. 11:7).
● "అబ్రాహాము కుటుంబము" - (ఆది. 18:18-19; హెబ్రీ. 11:8; 17).
● "ఇస్సాకు కుటుంబము" - (ఆది. 25:21-23; హెబ్రీ. 11;9; 20).
● "యాకోబు కుటుంబము" - (ఆది. 28:13-15; హెబ్రీ. 11:21).
● "యోసేపు కుటుంబము" - (ఆది. 39:23; 41:45-46; హెబ్రీ. 11:22).
● "మోషే కుటుంబము" - (నిర్గమ. 2:21-25; 3:12 హెబ్రీ. 11:23-26).
● "యెహోషువ కుటుంబము" - (యెహోషువ. 24:15)
● "దావీదు కుటుంబము" - (2 సమూయేలు. 7:29).
● "యోబు కుటుంబము" - (యోబు. 1:1-5).
● "పేతురు కుటుంబము" - (1 కొరింథీ. 9:5).
● "అకుల కుటుంబము" - (అపొ.కార్య. 18:26; రోమా.16:3).
● "కొర్నేలి కుటుంబము" - (అపొ.కార్య. 10:1-2).
● "చెరసాల నాయకుని కుటుంబము" - (అపొ.కార్య. 16:27; 31-33).



"స్త్రీకి లోబడిన పురుషుని యొక్క స్థితి"


● "హవ్వకి లోబడిన ఆదాము". - (ఆది. 3:6).
*ఫలితము - (ఆది. 3:9-21).
● "యెజెబెలుకి లోబడిన అహాబు" - (1 రాజులు. 21:6-8).  *ఫలితము - (1 రాజులు. 22:21-40).
● "భార్యలుకు లోబడిన సొలొమోను" - (1 రాజులు. 11:1-8).  *ఫలితము - (1 రాజులు. 11:11-14).
● "హేరోదియకు లోబడిన హేరోదు". - (మత్తయి. 14:3-11).
● "సప్పీరాతో ఆలోచనలో లోబడిన అననీయ" - (అపొ.కార్య. 5:1-4).  *ఫలితము - (అపొ.కార్య. 5:5-10).



 కుటుంబములో భార్య - భర్తల మధ్య పాత్ర 


A). భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. -
(1 కొరింథీ. 7:3).
B). పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. - (ఎఫెసీ. 5: 25).
C). పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు - (ఎఫెసీ. 5:28)
D). ఎక్కువ "బలహీనమైన ఘటమని" భార్యను సన్మానించి - (1 పేతురు 3:7a)
E). జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. - (1పేతురు 3:7b).
F). భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. -
(1 కొరింథీ. 7:5).
G). భర్త తన సొంత భార్యను పోషించి సంరక్షించుకొనవలెను. - ( ఎఫెసీ. 5:30).
H). అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. -
(1 కొరింథీ. 7:12).
I). అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. - (1 కొరింథీ. 7:14).
J). "మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులైయుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను." - (1 కొరింథీ. 7:33-35).
K). "సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భార్యకి పురుషుడు మంచి సహకారై ( అకుల వలె) ఉండాలి." - (అపొ.కార్య 18:26; రోమా 16:4).
L). "పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారు ఇరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి" - (ఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎఫెసీ. 5:31).
M). "పిల్లలును దేవునిలో పెంచే కార్యక్రమము భార్యభర్తలకు ఇవ్వబడినది". - (ద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; ఎపేసి. 5:31).
N). భార్యకు బద్ధుడవైయుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. - (1 కొరింథీ. 7: 27).
O). పురుషుడు తన యింటి వారును బాగుగా ఏలువాడునై యుండాలి. - (1 తిమోతి. 3:4).
P). పురుషుడు తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? - (1 తిమోతి. 3:5).

Note:- కుటుంబములో లోకానుసారమైన సమస్యలు ఉంటే సంఘములో ఆ పురుషుడు పరిపాలన చేయుటకు అర్హత లేదు.




"సంఘములో పురుషుని యొక్క బాధ్యత"



● దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. - (1 తిమోతి. 2:15; ఎజ్రా. 7:10).
● ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. -
(1 తిమోతి. 2:8).
● వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించాలి. - (1 కొరింథీ. 1:17; 2:1 9:16; ఎఫెసీ. 6;19 )
● మిక్కిలి అల్పులైన నీ తోటి సహోదరులకు మేలు చేయవలెను - (మత్తయి. 25:32-40; 2థెస్స. 3: 13).
● అపొస్తలుల ద్వారా వ్రాయబడిన ప్రతి పత్రికలో మనకి బోధింపబడిన విధులను(పారంపర్యములను) చేపట్టాలి. - (2థెస్స. 3:15; 2 తిమోతి 1:13).
● ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను - (1 పేతురు. 4:11).
● సంఘములో అధ్యక్ష పదవిని ఆశించినయెడల (1 తిమోతి. 3:1-5) లో చెప్పబడిన లక్షణములు కలిగి ఉండవలెను.
● సంఘములో పెద్దగా ఉండగోరువారు (తీతుకు. 1:5-9) లో చెప్పబడిన లక్షణములు కలిగి ఉండవలెను.
● జారత్వమునకు దూరముగా ఉండాలి మరియు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబము విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి - ( 1థెస్స. 4: 3; 1యోహాను. 2:16).
● సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము (ప్రభువు దినము) సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని(మూలభాషలో-లేపవలెనని) ఆలోచింతము. - (హెబ్రీ. 10:24-25).
● ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. -  (గలతీ. 6:1).
● సంఘములో పురుషులు మధ్య ఉపదేశము చేయుటకు తన భార్యకు అధికారము ఇవ్వకూడదు. - (1 కొరింథీ. 14:34-35; 1 తిమోతి. 2:12).
● పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెను. - (రోమా. 12:1).
● బలహీనుల దౌర్భల్యములను భరించుటకు మరియు సత్యమునకు సహాయకులమవునట్టు(జతపనివారమవునట్లు) అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము. - (రోమా. 15:1; 3 యోహాను. 1:8).
● సంఘములో వృద్ధుని - తండ్రి గాను,
సంఘములో వృద్ధ స్త్రీలను - తల్లులు గాను,
సంఘములో యౌవనులను - అన్నదమ్ములు గాను, సంఘములో యౌవన స్త్రీలను - అక్కచెల్లెండ్రలు గాను భావించి హెచ్చరిక చేయుము. ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. - (1 తిమోతి. 5:1-5).

గమనిక


◆ కుటుంబములో ప్రతి పురుషుడు తన యొక్క బాధ్యత సక్రమముగా నిర్వర్తిస్తే ఏ కుటుంబము కూడా దేవునికి దూరము కాదు.
◆ సంఘములో ప్రతి పురుషుడు తన యొక్క బాధ్యత గూర్చి ఆలోచించగలిగి అట్టి రీతిగా నడుచుకోగలితే ఆ సంఘము అభివృద్ధి చెందే విషయములో ముందడుగులో ఉంటుంది.

హెచ్చరిక


◆ స్త్రీ పాత్ర లేనిదే పురుషుడు నాయకుడు కాలేడు.
◆ పురుషుడుకు మాత్రమే ఇవ్వబడిన నాయకత్వపు లక్షణములను స్త్రీ అనుసరిoచకూడదు.

* దేవుని క్రమములో స్త్రీ పాత్ర * Click HERE

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు గుడివాడ

క్రైస్తవుడు, విగ్రహార్పితములను తినవచ్చునా..? (Can we eat things offered to Idols)

క్రైస్తవుడు, విగ్రహార్పితములను తినవచ్చునా..?


మనకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

మొదటి తిమోతికి 4:1,2,3

కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును 

దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 

ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన "ఆహార వస్తువులను" కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. 

A) దేవుడు సృజించిన "ఆహార వస్తువులను" కొన్నిటిని తినుట మానవలెనని చెప్పిన వాడు అబద్ధికుడే.

B) "ఆహార వస్తువులు కానివి" కలవు అవి తినమని చెప్పువాడు కూడా అబద్ధికుడే.


:: ఆహార వస్తువులు :: 


(ఆదికాండము 1:29)

దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.

(ఆదికాండము 9:3)

ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.

క్రైస్తవుడుకు, విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్షఫలములు, సమస్త చరములు అనగా "నీటియందును, నేలపైనను జీవించు జంతువులు". మరియు పచ్చని కూర మొక్కలు ఆహార వస్తువులు.


:: ఆహార వస్తువులు కానివి ::


క్రైస్తవుడుకి, ఆహార వస్తువులు కానివి ఏంటో దేవుని గ్రంధమే తేటగా తెలియజేస్తుంది.

● రక్తము. 
● విగ్రహ అర్పితము.

"రక్తము"

(ఆదికాండము 9:4)

అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.

(లేవి. కాం. 17:10,12)

ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునైనను తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై వానిని నా జనులలో నుండి  కొట్టివేయుదును.

కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు కూడా రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

క్రైస్తవులకు, రక్తము ఆహార వస్తువు కాదు.


"విగ్రహ అర్పితము"

(అపొ. కార్య. 15:20,28)

విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

క్రైస్తవులకు, "విగ్రహములకు అర్పించినవి" మరియు "గొంతుపిసికి చంపినవి"
ఆహార వస్తువులు కాదు.

కొందరు బోధకులు "ఆహార వస్తువులు కానివి" వాటి విషయములో సమర్థిస్తూ తినేయవచ్చు అనటము వాక్య విరుద్ధమే.


పాత నిబంధనలో విగ్రహ అర్పితము నిషేధమే


ఇతర దేవుళ్ళకు అర్పణలివ్వడం, పూజ చేయడం ఇస్రాయేల్‌వారికి నిషేధము.

● నేను తప్ప "వేరొక దేవుడు నీకు ఉండకూడదు". - (నిర్గమ. 20:3).
● యోహోవాకు మాత్రమే గాక "వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు". - (నిర్గమ. 22:20).
● ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల "నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము". - (నిర్గమ. 34:15).

◆ బిలాము తన స్వస్థలం నుండి మళ్ళీ తిరిగి వచ్చి బాలాకుకు నేర్పిoచిన బోధ ఏమనగా,

(సంఖ్యాకాండము 25:1,2)

అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.

ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు "భోజనముచేసి" వారి దేవతలకు నమస్కరించిరి.

● బిలాము మాట బట్టి "విగ్రహములుకు అర్పించిన భోజనము చేయుట" వలన ఆ ప్రజలకు తెగులు పుట్టెను. - (సంఖ్యా.కాం. 31:16; ప్రకటన. 2:14).


 క్రైస్తవుడు, అంగడి లో తినవచ్చునా?


అంగడి అనగా ఆహార వస్తువులమ్మెడి చోటు లేదా దుకాణము.

● దుకాణము అనేది విగ్రహములకు అర్పించిన స్థలము కాదు.
● దుకాణములో భోజనము తినటము సమస్య అవ్వదు. కానీ విగ్రహములకు అర్పించిన వాటిని తినటము సమస్య అవుతాది.

(మొదటి కొరింథీ. 10:25)

మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.


క్రైస్తవుడు, విగ్రహాలయయందు భోజనపంక్తిలో కూర్చోవచ్చునా.?


● లోకమందు విగ్రహములు వట్టివే - (1కోరింథీ. 8:4).
● విగ్రహాలయయందు భోజనము చేయువారు ఆ పదార్ధములు విగ్రహములుకు బలి ఇయ్యబడినవని యెంచి తింటారు - (1 కోరింథీ. 8:7).
● క్రైస్తవుడు, ఈ భోజనము చేయుట వలన దేవుని యెదుట మెప్పు పొందడు. - (1 కోరింథీ. 8:8).
● విగ్రహాలుకి అర్పించినవి వట్టివే అని ఆలోచన చేసి, నాకు స్వాతంత్ర్యము కలదు అని (1 కోరింథీ. 8:9) విగ్రహాలయయందు భోజనపంక్తిలో కూర్చొని తింటే (1 కోరింథీ. 8:10) నీ యొక్క సహోదరులకు విరోధముగా పాపము చేయుటయే కాక, నీ బలహీనమైన సహోదరుడు మనస్సాక్షిని గాయపరచేవాడివి మరియు నీవు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువాడవు అవుతావు. (1 కోరింథీ. 8:12)
● నీ సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకు మరియు క్రీస్తునకు విరోధముగా పాపము చేయకుండుటకు విగ్రహాలయయందు భోజనపంక్తిలో కూర్చొని తినే కార్యక్రమము మానివేసుకోవాలి. - (1కోరింథీ. 8:13).


 క్రైస్తవులు,  అవిశ్వాసులు విందులో పొల్గొని తినవచ్చునా..?


● అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. - (1 కొరింథీ. 10:27).
● ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. - (1కోరింథీ. 10:28).

◆ మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. - (1కొరింథీ. 10:29).

◆ విగ్రహమునకు అర్పించినదే అని తెలిసి కూడా తింటే నీవు దేవుని యెదుట దోషియని తీర్పునొందువు. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. - (రోమా. 14:23).


"క్రైస్తవుడు, దయ్యపు బల్లలో పాలుపొందవచ్చునా..?" 


● క్రైస్తవుడు, విగ్రహారాధనకు దూరముగా పారిపోవలసిన అవసరత ఎంతో కలదు. - (1కొరింథీ. 10:14).
● అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. - (1 కొరింథీ. 10:20).
● మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు. - (1 కోరింథీ. 10:21)


గమనిక


◆ క్రైస్తవుడు, విగ్రహార్పితములను ఆహార పదార్థముగా తీసుకోకూడదు.
◆ దేవుడు సృజించిన "ఆహార వస్తువులను" కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి (1 తిమోతి. 4:3-4). కానీ "ఆహార వస్తువులు కానివి" కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోకూడదు.

హెచ్చరిక


దేవుని ఆలోచన ప్రకారం జీవిస్తారో లేక మనుష్యుల ఆలోచన ప్రకారం జీవించి దేవునికి దూరమౌతారో అది మీరే ఆలోచించుకోండి.

మీ ఆత్మీయులు...
The churches of Christ greet you - Roma 16:16