Showing posts with label పాపము. Show all posts
Showing posts with label పాపము. Show all posts

"కోపము" (Anger)


కోపము

తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, క్రీస్తుయేసునందు భద్రము చేయబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

మానవునికి కోపము సహజము. అలాగని అన్నివేళలా, అన్ని విషయాలలో కోపపడుట మరియు కారణం లేకుండా ఎదుటివారిపై చిరాకు పడటం వలన అనేక ఇబ్బందులకు గురవుతుంటాము. అయితే కొన్నిసార్లు కోపడుట చేత మంచి జరిగే అవకాశము కూడా ఉంది. కాని మన కోపము మనలను దేవునికి దూరము చేసే విధముగా ఉండకూడదు.   మానవుడు తన కోపాన్ని ఎప్పుడు ప్రదర్శించాలి మరియు ఎలాంటి సందర్భాలలో కోపమును అదుపు చేసుకోవాలో ఈ అంశము ద్వారా ఆలోచన చేద్దాము.

దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంథములో చాలామంది కోపము తెచ్చుకున్నారు కాని పాపము చేయనివారిగా ఉన్నారు, దేవునికిష్టులుగా జీవించారు. వారు ఏ ఏ సందర్భాలలో కోపడ్డారో లేఖనములు చూద్దాము.

మోషే :


» అతడు (మోషే) పాళెమునకు సమీపింపగా, దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. (నిర్గమ. 32:19).

యేసుక్రీస్తు :


» సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. నీవు లేచి మధ్యను నిలువమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచి - విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారిహృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి - నీ చెయ్యి చాపుమని మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.(మార్కు. 3:1-5).

అపోస్తులుడైన పౌలు :


» పౌలు అతేనైలో వారికొరకు కనిపెట్టకొని యుండగా, పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.(అపొ.కార్య. 17:16).

ప్రియులారా, మనము ఖచ్చితముగా కోపపడాల్సిన సందర్భాలు కొన్ని వస్తుంటాయి అయినప్పటికీ పాపమునకు అవకాశమివ్వకుండా మన హృదయములను సమాధాన పరచుకోవాలి.

 ★ కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించిన పిమ్మట మీ కోపము నిలిచియుండకూడదు. (ఎఫెసీ. 4:26).

పైన సందర్భములో పౌలు గారు కోపము తెచ్చుకున్నారు కాని పాపము చేయుటకు ఎంతమాత్రమును అవకాశామియ్యక అతేనైలో ఉన్న జనులతో చాలా చక్కగా జ్ఞానముతో నడుచుకున్నట్టుగా అపో.కార్య. 17వ అధ్యాయము 17వ వచనము నుండి చివర వరకు చూడగలము.

మంచి కొరకు కోపపడినప్పటికీ దేవునికి విరోధముగా పాపము చేయకుండా తమ ఆత్మలను రక్షించుకున్న వారు అనేకమంది పరిశుద్ధ గ్రంధములో కలరు.

ప్రియ సహోదరుడా, సహోదరీ మన కోపము ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, మన ఆత్మీయులను మనకు దూరం చేసేటట్టుగా ఉండకూడదు. కొన్ని సమయాలలో అతి కోపము వలన అపవాదికి అవకాశమిస్తూ, దేవుని పనిని అడ్డగించేవారిగా ఉంటాము. కాబట్టి కోపాన్ని అణిచివేసుకోగలిగితే మేలుకరమైన జీవితమును జీవించగలము.

» కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము. – (కీర్తన. 37:8).

» మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. (కొలస్సి. 3:8).

A). వివాహబంధముతో ఒక్కటైనా వారి మధ్య కోపము ఎంత తక్కువుగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు కారణము లేకుండా కోపడకూడదు.

» భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. (సామెతలు. 6:34).

» మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. (సామెతలు. 15:1).

» క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?. – (సామెతలు. 27:4).

B). తల్లితండ్రులు పిల్లల విషయములో కోపమును అణిచివేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మంచి మాటలతోనే వారిని సమాధానపరుచుట మంచిది.

» తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. (కొలస్సి. 3:21).

» తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.(ఎఫెసీ. 6:4).

» బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.(సామెతలు. 19:18).

C). మన కోపము మన ప్రార్థనా జీవితముకు ఆటంకము కాకుండా చూసుకోవాలి.

» కావున ప్రతిస్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. – (1 తిమోతి. 2:8).

D). తోటి సహోదరులపై కోపము తెచ్చుకుని విమర్శకు లోనవకూడదు.

» తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును. ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. (మత్తయి. 5:22).

E). క్రోధము గలవారితో సహవాసము చేయకుండుట మనకు మేలు.

» కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము. – (సామెతలు. 22:24).

» కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.(సామెతలు. 29:22).

» కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.(సామెతలు. 17:19).

F). శరీర కార్యములలో కోపము కూడా ఒక్కటై ఉన్నది కనుక కోపమును ఖచ్చితముగా విసర్జించాలి.

» శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పినప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.(గలతీ. 5:19-21).

మన నోరు తెరవాల్సిన సందర్భాలలో తప్ప మిగతా అన్ని సమయాలలో మనము మన నోటిని కాచుకున్నట్లయితే కోపముకు అవకాశమియ్యలేము పాపమూ చేయలేము. ఈ విషయముపై ఇబ్బందులు పడుతున్నవారు ఒకసారి ఆలోచన చేసి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని దేవునికిష్టులుగా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాను.  నోరు తెరువవద్దు.

 ★ నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.  – (యాకోబు. 1:19).

మీ ఆత్మీయులు,

నవీన మనోహర్.  

"క్రైస్తవులు ఖచ్చితంగా పాపమును ద్వేషించాలి" (Christians must hate sin)

క్రైస్తవులు ఖచ్చితంగా పాపమును ద్వేషించాలి


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈ లోకములో చాలామంది ద్వేషము అంటే చాలా ప్రతికూలమైన పదమని, పగలు, ప్రతీకారాలు ఉన్నవారు మాత్రమే ద్వేషము కలిగి యుంటారని, మనము ఏ విషయములోను ద్వేషము కలిగి ఉండకూడదనీ, ప్రేమ - ద్వేషము రెండు కలిసి ఉండవనీ అలా ఉంటే అతడు మనిషి కాదనీ ఇలా పలు రకాలుగా ఆలోచిస్తారు.

ప్రియులారా ఈ విధముగా ఆలోచించుట మంచిదే కానీ క్రైస్తవులమైన మనకీ ఈ రెండూ ఉండాలి. క్రైస్తవులమైన మనము ప్రేమను మాత్రమే కలిగియుండాలి కదా ద్వేషము ఉండకూడదు కదా అని ఆలోచన రావచ్చు అయితే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, మనము నిజమైన క్రైస్తవులమైతే మనము దేవుని యెడల , సహోదరుల యెడల ప్రేమ కలిగి ఉండాలి అలాగే పాపమును ఖచ్చితంగా ద్వేషించే వారముగా ఉండాలి. కానీ మనలో చాలామంది ప్రేమ, ద్వేషము ఈ రెండిటిని ఒకే విషయములో చూపిస్తూ దేవునికి విరోధులవుతున్నారు.

★ క్రైస్తవుడైన నీవు చెడుతనమును అనగా పాపమును ద్వేషిస్తేనే దేవుని ప్రేమించగలవు.

» యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. – (కీర్తన. 97:10).

★ ఒకవైపు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మరోవైపు పాపముకు దాసులైన యెడల అట్టివారిని దేవుడు తృణీకరిస్తాడని గ్రహించాలి.

» ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు.(మత్తయి. 6:24).

★ క్రైస్తవుడవైన నీవు పాపమును ద్వేషిస్తేనే దేవుని యెడల భయభక్తులు చూపగలవు.

» యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. (సామెతలు. 8:13).

★ క్రైస్తవుడవైన నీవు అబద్ధమను పాపమును ద్వేషిస్తేనే నీతిగా ఎంచబడతావు.

» నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. (సామెతలు. 13:5).
అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము. – (కీర్తన. 119:163).

★ క్రైస్తవుడవైన నీవు సత్యమందు నిలిచియుండక పాపమును ద్వేషించని యెడల నీవు అపవాది సంబంధివని తీర్పు తీర్చబడుతుంది కనుక అపవాది క్రియలను ద్వేషించాలి.

» మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. (యోహాను. 8:44).

» ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. (1 యోహాను. 2:4).

★ యేసు, క్రీస్తు కాడని అనుచూ, ఆయన మనకు ఏమై ఉన్నాడో పరిపూర్ణ విశ్వాసముతో నీవు నమ్మని యెడల నీవు అబద్ధికుడవుతావని గ్రహించి తండ్రిని, కుమారుని సరియైన విధానములో ఒప్పుకొని పాపమునకు దూరముగా ఉండాలి.

» యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. (1 యోహాను. 2:22).

» అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. – (రోమా. 10:9).

★ క్రైస్తవుడవైన నీవు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచూ నీ సహోదరుని ద్వేషించిన యెడల నీవు పాపమును అసహ్యించుకొనువాడవు కావు.

» నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. – (1 యోహాను. 4:20).

★ నీవు  క్రైస్తవుడవని చెప్పుకుంటూ ఈ క్రింది క్రియలు కలిగియున్న యెడల నీవు పాపమును ప్రేమించువాడవు.

» పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుగుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన. 21:8).

★ మన దేవుడు ఏ ఏ విషయములను అసహ్యించుకుంటున్నాడో ఆయా విషయములన్నిటిని మనము కూడా ద్వేషించాలి అప్పుడే నీవు దేవుని దృష్టికి యోగ్యుడవు.

» యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను, చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును, లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. (సామెతలు. 6:16-19).

★ క్రైస్తవుడవైన నీవు తప్పుడు మార్గములో వచ్చు లాభమును ద్వేషిస్తేనే దీర్ఘాయుష్మంతుడగుతావు.
దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. – (సామెతలు. 28:16).

» నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును. – (యెషయా. 33:15).

★ క్రైస్తవుడవైన నీవు దుష్టత్వమును ద్వేషించాలి.

» యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు. – (కీర్తన. 11:5).

» దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురులోభులు యెహోవాను తిరస్కరింతురు. – (కీర్తన. 10:3).

★ ఈ లోకములో అబద్ద ప్రవక్తలున్నారు కనుక దేవుని సంబంధమైన వారెవరో గ్రహించి అబద్ద బోధలను ద్వేషించే వారిగా ఉండాలి.

» ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. (1 యోహాను. 4:1).

» అబద్ధ ప్రవక్తలుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. (మత్తయి. 7:15).

ప్రియ సహోదరుడా, సహోదరీ క్రీస్తు కూడా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు కనుకనే దేవుడు ఆయనను ఆనంద తైలముతో అభిషేకించాడు.

»  నీవు నీతిని ప్రేమించితివి దుర్ణీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీతోటివారికంటె నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:9).

క్రైస్తవులమైన మనము కూడా సహోదరుల యెడల ఎంత ప్రేమ కలిగి యున్నామో  అలాగే పాపము యెడల మాత్రమే ద్వేషము కలిగి యుంటేనే దేవుడు మనలను కూడా క్రీస్తుతో సమానమైన వారసత్వమునిచ్చి మనకు నిత్యజీవమును అనుగ్రహిస్తాడు.

ప్రియులారా, నేటి క్రైస్తవులలో అనేకమంది సహోదరుల యెడల ప్రేమను మాత్రము కాదు ద్వేషము కూడా కలిగియుండి, సహోదరుల పట్ల పక్షపాతము చూపిస్తూ, పాపమును ప్రేమించేవారిగా ఉంటూ, అపవాది సంబంధులగా ఎంచబడుతున్నారు. అంతేకాకుండా సందర్భమును బట్టి వారి ఆలోచనలు మార్చుకుంటూ దేవుని యందు నిలకడగా ఉండలేకపోతున్నారు. అలా కాకుండా పాపమును పూర్తిగా ద్వేషించినట్లయితే మన జీవితములో అనేక ఆశీర్వాదములు పొందుకోగలమని, దేవుని చెంతకు చేరగలమని గ్రహించి సహోదరుల యెడల ప్రేమ, పాపము యెడల మాత్రమే ద్వేషము కలిగియుండాలని నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

● ప్రేమ దుర్ణీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. (1 కొరింధి. 13:6).

● కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి,.. – (ఆమోసు. 5:15).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"నోరు తెరవద్దు" (Shut your mouth)

"నోరు తెరవద్దు"


ఏ ఏ  సందర్భాలలో నోరు తెరవకుండా ఉండాలి?

● కోపము ఎక్కువగా ఉన్నప్పుడు. – (సామెతలు. 14:17).
● ఏ విషయములోనైనా నిజా నిజాలు తెలియనప్పుడు. – (సామెతలు. 18:13).
● ఏ విషయములోనైనా సరియైన అవగాహన లేనప్పుడు. – (ద్వితియో. 17:6).
● నీ మాటలను బట్టి నీ సహోదరుడు బలహీనపడే సమయములో. – (1 కొరింధి. 8:11).
● నీ మాటలు ప్రభువును, కుటుంబమును మరియు స్నేహితులను బాధపెట్టేలా (లేదా) దూషించేలా ఉన్నప్పుడు. – (1 పేతురు. 2:21-23).
● పాపము చేయుటకు మరియు అపహాస్యము చేయుటకు ప్రేరేపణ కలిగినప్పుడు. – (సామెతలు. 14:9).
● నీ మాటలు నీతిగా అనిపించనప్పుడు. – (సామెతలు. 8:8).
● దేవుని సన్నిధిలో అనాలోచితమైన మాటలు పలుకుటకు నీ హృదయము త్వరపడినప్పుడు. – (ప్రసంగి. 5:2).
● మితమైన మాటలు నీ నోటి వెంట రానప్పుడు. – (సామెతలు. 17:27).
● విషయము నీకు సంబంధించినది కానప్పుడు. – (సామెతలు. 14:10).
● మూర్ఖపు మాటలు మాట్లాడుటకు ప్రేరేపణ కలిగినప్పుడు. – (సామెతలు. 4:24).
● నీ మాటలు ఎదుటివారికి కీడును కలిగిస్తున్నాయని తెలిసినప్పుడు. – (సామెతలు. 16:27).
● నీ మాటల వలన మంచి స్నేహమును కూల్చుకున్నపుడు. – (సామెతలు. 25:28).
● నీ ఆలోచనలు శాపకరముగా ఉన్నప్పుడు. – (యాకోబు. 3:9).
● కీడు విషయములో నీ మనస్సును అణచుకొనలేనప్పుడు. – (సామెతలు. 25:28).
● జ్ఞానవంతమైన మాటలు వినునప్పుడు. – (సామెతలు. 13:1).
● నీ మాటలు నీకు ప్రీతికరమైనవి అనే భావన కలిగినప్పుడు. – (సామెతలు. 18:21).
● చెప్పిన మాటనే ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు. – (సామెతలు. 19:13).
● నీ మాటలు దోషము చేయుటకు ప్రేరేపణ కలిగించినప్పుడు. – (సామెతలు. 24:24).
● పని చేయకుండా నోటి మాటలు ద్వారానే లాభమును ఆశించినప్పుడు. – (సామెతలు. 14:23).


(సామెతలు. 21:23)
నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు. 




The churches of Christ greet you - Roma 16:16