క్రిస్మస్ అయిపోయిందా!? (Is Christmas done!?)

క్రిస్మస్ అయిపోయిందా!?

నమస్తే మిత్రమా.., మిద్దె మీద స్టార్ పెట్టావా, ఇంట్లో చెట్టు పెట్టావా, ఇంటి చుట్టూ డెకరేషన్ చేసావా, పిండి వంటలు వండి అందరికీ పంచిపెట్టావా, కొత్త బట్టలతో అలంకరించుకుని చర్చిలో హంగామా చేసావా, అబ్బో ఇంకా బోలెడన్ని ఉంటాయి కదా ఒక్కటేమిటి పాటలు, డాన్సులు ఇలా చాలా చేసే ఉంటావు కదా! అయిపోయిందా..? ఈ సంవత్సరానికి నీ క్రిస్మస్ సందడి... 

మరి నాదో సందేహం మిత్రమా ఇవన్నీ చేసావు కదా వీటన్నిటి వలన నీకేమి ఒరిగింది? దేవునికి ఏమి ఒరిగింది? అసలు నువ్వు చేసిన పుట్టినరోజే క్రీస్తుది కదా మరి ఆయనకి ఏమి ఒరిగింది???


చాలామంది ఈ ప్రశ్నలకు ఏం చెప్తారో తెలుసా! మేము ఇవన్నీ చేయటం వలన దేవుని మహిమపరిచాము అని చెప్తారు. ఒక్కసారి  నీ మనస్సాక్షిని అడుగు మిత్రమా నువ్వు నిజంగా దేవుని మహిమపరిచావా?🤔 ఎప్పుడూ దేవుని సన్నిధికి రానివారు ఆరోజు వస్తారు, ఏనాడు నీకు వందనములు చెప్పనివాడు ఆరోజు నీకు విష్ చేస్తాడు, సంవత్సరమంతా లోకంలో భయంకరంగా బ్రతికినవాడు ఆరోజు మాత్రం స్టేజీలు ఎక్కి పాడుతాడు, డాన్స్ చేస్తాడు... ఇది ప్రతీ సంవత్సరం రిపీట్ అవుతూనే ఉంటుంది అయినా కూడా నువ్వు సమర్ధిస్తావు..

మరి ఇలాంటి వ్యక్తులను సమర్థించే నీవు దేవుని ఎలా మహిమ పరుస్తావు..? అబ్బే లేదు.. లేదు.. మేము ఇలా చేయడం వలన సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని చెప్పాలనుకుంటున్నావా? అసలు సువార్త అంటే ఏంటో తెలుసా నీకు..  ఆనాడు క్రీస్తు ఇలాగే దేవుని రాజ్యసువార్త చేశాడా? అపోస్తులులు ఇలాగే ప్రకటించారా? ఆదిమ క్రైస్తవులు ఈ రకంగానే ఏటేటా క్రీస్తు పుట్టినరోజుని చేసి అన్యుల మధ్య నడుచుకున్నారా? లేదు కదా మరి నువ్వేంటి మిత్రమా నీకు తోచిన సమాధానం చెప్పి నిన్ను నీవు సమర్ధించుకుంటున్నావు....

నిజంగా దేవుడు ఇదే కోరుకుంటున్నాడా!!  క్రిస్మస్ పేరుతో అన్యాచారాలు చేస్తే ఆయన సంతోష పడతాడా? నీ సంతోషాల కోసం, పండగ పేరుతో నువ్వు ఎంజాయ్ చేయడం కోసం ఆయన పేరును ఎందుకు మధ్యలోకి లాగుతావు...  ఇలాంటి లోకానుసారమైన పద్ధతులు పాటించడం వలన ఆనాటికి నీకు సంతోషం కలగచ్చు కానీ దేవుని సముఖంలో నీకు  ఏమాత్రం మేలు కలగదు.. నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే సత్యం. 


క్రీస్తు మానవాళి పాపక్షమాపణ నిమిత్తం భూమి మీదకు వచ్చాడు. (మత్తయి. 1:21; లూకా 5:24; 24:47) కానీ భూమి మీద తాను ఎటువంటి ఆడంబరాలు చేసుకోవడానికి రాలేదు. అంతేకాదు మిత్రమా ఆయన శరీరాధారిగా ఈ భూమిమీద ఉన్నపుడు ఏ అడంభరము చేసుకోలేదు చేయమని ఎవ్వరినీ కోరలేదు ఇంకా వాస్తవమేమిటంటే తలదాల్చుకొనుటకైననూ ఆయనకు స్థలము లేదు. (మత్తయి. 8:20; లూకా. 9:58)  ఆ మహానుభావుడు సర్వోన్నతుడైన దేవునికి కుమారుడై ఉండి దరిద్రతను అనుభవించాడు కదా.  దేనికోసం...? (2 కోరింథీ. 8:9) ఈరోజు నువ్వు ఇవన్నీ చేసి ఆయన చేసిన త్యాగాన్ని నవ్వులపాలు చేయడానికా?!!!

నీవు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు మిత్రమా,! నీవు ఆ త్యాగమూర్తి చేత అంగీకరింపబడాలంటే ఆయన చెప్పిన మార్గంలో నడచుకోవాలా లేక ఈ లోకం కొరకు అంటే కేవలం ఈ లోకం వరకు మాత్రమే అట్టహాసలతో బ్రతికితే సరిపోతాదా? (లూకా. 6:46-49)


ఈ లోకంలో తాము గొప్ప సేవకులమని చెప్పుకొనువారు, మా తాత ముత్తాతల నాటి నుండి మేము క్రైస్తవులమని గర్వంతో చెప్పుకునే తిరిగేవారు, ఇంకా క్రీస్తు గురించి, బైబిలు గురించి అసలు అవగాహన లేనివారు క్రిస్మస్ పేరుతో చేసే పనులు నీకు కానరావట్లేదా? నీ మనసును గద్ధించట్లేదా? కొందరేమో గొప్పలకోసం పెద్ద పెద్ద స్టేజీలు కట్టిస్తారు, కొందరేమో మనకేదో దేవుని పాటలు కొదువైనట్టు తెలిసి తెలియని జ్ఞానంతో పాటలు రాసి వాటిని సినిమా పాటల స్టైల్లో పాడుతున్నారు ఇంకొంతమంది ఏకంగా సినిమా పాటల ట్యూన్లే వాడేస్తున్నారు.. ఇది ఎంతవరకు సమంజసం? ఏనాడైనా ఆలోచించావా? నువ్వు నిజంగా క్రైస్తవుడవైతే నిజంగా నీ గమ్యం పరలోకం అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తావు. (రోమా. 12:17; 13:14; 1 యోహాను. 4:1-3)


ఈరోజు మనం క్రీస్తుని ఎరిగామంటే దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఈనాడు పేరు చెప్పుకునే సేవకుడని అనుకోకు, లేదా నీ తల్లి తండ్రి అని అనుకోకు లేదా ఇంకెవరో అని భ్రమ పడకు. దానికి కారణం ఆ అపోస్తులలు కన్నీటి ఫలితం. క్రీస్తు తమకు ఏదైతే చెప్పాడో అది మాత్రం ఈ లోకంలో ప్రకటన చేసి తాము కూడా  అలాగే జీవించి తమ ప్రభువు నిమిత్తం హతసాక్ష్యులగా మారి, క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమను కడవరకు చూపించి ఘోరంగా హింసింపబడిన వారి త్యాగఫలం. నిజంగా వారు పడిన పాట్లు, వారు పొందిన హింస, వారు అనుభవించిన శ్రమ నీవు ఎరిగి ఉంటే, క్రీస్తు నిమిత్తం శ్రమపడినప్పుడు, శోధింపబడినప్పుడు  వారు పొందిన ఆనందము, వారి అనుభవం జ్ఞానపూర్వకంగా నీవు ఎరిగి ఉంటే ఈ(లోక) రీతిగా జీవించవు మిత్రమా! 


నువ్విలా అన్యాచారలతో బ్రతకడానికా క్రీస్తు సిలువ మరణం నొందాడు, నువ్విలా అపవాదితో చేతులు కలపడానికా ఆనాటి భక్తులు హతులయ్యారు? నిజంగా ఇందుకేనా క్రీస్తు ఈలోకానికి వచ్చాడు ? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో మిత్రమా! 


క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు చేయడం, గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు మరణాన్ని ప్రచారం చేయడం ఇదేనా క్రైస్తవ్యం?! ఇవి చేస్తే చాలు మేము క్రైస్తవులమైపోతాం అని చెప్పుకున్నవారు లేకపోలేదు.. మరి  మనుష్యుల పద్ధతి చొప్పున చేసిన నువ్వు ఒక క్రైస్తవుడవని చెప్పుకుంటే  మరి హతులైన అపొస్తులులు ఎవరు, హింసింపబడిన ఆదిమ సంఘస్తులు ఎవరు? ఏ ఆడంబరాలు లేకుండా కేవలం క్రీస్తు నిమిత్తం బ్రతికిన వారికి నీకు ఒకటే పేరా? ఆలోచించు.. 

కేవలం నీ సంతోషం కొరకు నువ్వు ఇవన్నీ చేసావని, చేస్తున్నావని నీ మనస్సాక్షి ఇప్పటికే సెలవిచ్చి ఉండచ్చు అయినా కూడా నిన్ను నీవు సమర్ధించుకుంటే చివరిగా ఒక మాట! 


🔎 ఒక క్రైస్తవుడికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? 


1.  క్రీస్తు యొక్క త్యాగాన్ని ఆత్మానుసారుడై,  హృదయానుసారంగా గుర్తించినప్పుడు. - (ఫిలిప్పీ. 2:4-8; హెబ్రీ. 2:14-15)

2. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, ఆత్మతోను, సత్యముతోను, హృదయముతో యథార్థముగా దేవుని (తండ్రిని) ఆరాధించినప్పుడు. - (యోహాను. 4:20-24)

3. ఆదివారము ప్రభువుబల్లలో పవిత్రమైన చేతులతో చేయి పెట్టినప్పుడు. - (అపో. కార్య. 20:7; 1 కోరింథీ. 11:17-34)

4.  క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు ఓపికతో, సహనంతో ఆ శ్రమను జయించినప్పుడు. - ( యాకోబు. 1:2; 1 పేతురు. 1:7)

5.  శోధన సహించినప్పుడు. - (యాకోబు. 1:12)

6. సహోదరులతో సహవాసం కలిగియున్నప్పుడు. - (అపో.కార్య. 2:42; 1 యోహాను. 1:3; కోరింథీ. 7:24)

7. నీ ప్రవర్తనతో ఇతరులను క్రీస్తు నొద్దకు నడిపించినప్పుడు. - (1 తిమోతీ. 4:12; ఎఫెసీ. 4:22; కోరింథీ. 15:34; యాకోబు. 3:13; 1 పేతురు. 1:14)

8. నీవు దేవునికి దగ్గరగా ఉన్నావని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యమిచ్చినప్పుడు. - (అపో. కార్య. 24:16; రోమా. 2:15; హెబ్రీ. 10:22; 1 పేతురు. 2:19; 3:21)

9. అపవాదిని ఓడించి క్రీస్తు పక్షాన విజయాన్ని పొందుకున్నప్పుడు. - (రోమా. 16:20; 2 కోరింథీ. 10:1-7). 


           📖ఇవేమీ నీకు అనుభవం లేకపోతే నీవు క్రైస్తవుడవు కాదు మిత్రమా ఇది నేను చెప్పుటలేదు దేవుని గ్రంథమే సెలవిస్తుంది.


ఇప్పుడు చెప్పు మిత్రమా ఇంత ఖర్చుపెట్టి, అట్టహాసంగా క్రిస్మస్ అనే అన్య పండుగను చేసావు కదా నీకేమి ఒరిగింది? ఏం సాధించావు? నువ్విలా చేయడం వల్ల క్రీస్తుకు ఏమి ఒరగలేదు మిత్రమా ఎందుకంటే ఆయన కోరుకునేది ఆయన పక్షాన నిలబడేవారిని తప్ప ఈ లోకనుసారులను కాదు. క్రీస్తు పక్షాన నిలబడేవారెవరో నీకు ఇప్పటికే అర్ధమయ్యి ఉండాలి. 

దేవుడు ఇటువంటి పండుగలు కోరలేదు, అట్టహాసాలు కోరలేదు, సంబరాలు అంతకంటే కోరలేదు. ఆయనకు కావల్సింది యదార్థ హృదయం మరియు తన కుమారుని పక్షాన సైన్యంలో పోరాడే యోధులు.


సమయం లేదు నీ నిర్ణయం ఏమిటో ఆలోచించుకో క్రీస్తు సైన్యంలో సైనికుడిగా ఉంటావా అపవాది పక్షాన ఉంటావా!?

మీ ఆత్మీయులు👪

క్రిస్మస్ చరిత్ర క్లిక్ చేయు
పుట్టినరోజు వేడుకలు క్లిక్ చేయు
క్రీస్తును ఆరాధన చెయ్యాలా? క్లిక్ చేయు

Share this

Related Posts

Latest
Previous
Next Post »

3 comments

comments
Dec 26, 2024, 9:01:00 PM delete

100% i agreed with u brother.
నేను ఈ పేజీ ధ్వర చాలా నేర్చుకుంటున్నాను tq

Reply
avatar
Dec 27, 2024, 6:03:00 PM delete

Tq, so much brother, miru ilanti vishayalu marenno thelupalani koruthunanu, nadhoka request brother, thelisina thappune malli malli chesthunnam kadha, dhanikosam konni vishayalu cheppandi🤝

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16